చైనా పాలనా విధానాలకు వ్యతిరేకంగా హాంగ్ కాంగ్ ప్రజలు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. నిరసనకారులు చైనా కార్యాలయంపై గుడ్లతో దాడి చేశారు.
ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయోగించిన భాష్పవాయువుతో నగరంలో దట్టమైన పొగ వ్యాపించింది.
ప్రభుత్వ మద్దతుదారులైన సాధారణ ప్రజలూ ముసుగులు ధరించి ఆందోళనకారులపై దాడులకు దిగారు. ఈ దాడుల్లో పలువురికి గాయలయ్యాయి. హాంగ్‌కాంగ్‌లో ఈ మధ్య కాలంలో జరిగిన నిరసనల్లో ఇదే పెద్దదని అంచనా.
బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న హాంగ్‌కాంగ్ 1997 జులై 1న చైనా పరిపాలనలోకి వచ్చింది. 'ఒకే దేశం, రెండు వ్యవస్థలు' ద్వారా ఇప్పటికీ ప్రత్యేక పాలన సాగిస్తోంది. చైనా పరిపాలనలోకి వచ్చి 22 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 'వాన్ చై'లోని కన్వెన్షన్ సెంటర్లో ప్రభుత్వం సోమవారం సంబరాలు నిర్వహించింది. ఈ ఉత్సవాలను వ్యతిరేకిస్తూ వేలాది మంది రోడ్డెక్కారు.
నేరపూరిత కేసుల విచారణ నిమిత్తం తమ దేశ పౌరులను చైనాకు అప్పగించాలన్న బిల్లుకు వ్యతిరేకంగా హాంగ్‌కాంగ్ ప్రజలు ఇటీవలే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. వారం రోజుల పాటు జరిగిన ఈ నిరసనల అనంతరం ఆ బిల్లును పక్కనబెడుతున్నట్లు హాంగ్‌కాంగ్ ప్రభుత్వాధికారులు ప్రకటించారు.
ఇదీ చూడండి: మోదీ 2.0కు 50 రోజులు- మార్పు దిశగా భారత్