అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా బలగాలు పూర్తిగా నిష్క్రమించిన నేపథ్యంలో దేశ పరిపాలనా వ్యవహారాలపై తాలిబన్లు(Afghanistan Taliban) దృష్టి కేంద్రీకరించారు. రాబోయే కొన్ని రోజుల్లోనే వారు ప్రభుత్వాన్ని(Taliban govt) ఏర్పాటుచేయనున్నారు. గత సర్కారులోని కొందరు నేతలు, ఇతర ప్రముఖులతో తాము విస్తృతస్థాయిలో సంప్రదింపులు జరిపామని తాలిబన్ సాంస్కృతిక కమిషన్ సభ్యుడు బిలాల్ కరీమీ బుధవారం తెలిపారు. సమ్మిళిత ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్ కూర్పుపై ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పారు.
రోజువారీ పరిపాలనా వ్యవహారాలను తమ రాజకీయ విభాగపు అగ్ర నేత అబ్దుల్ ఘనీ బరాదర్(Baradar Taliban) నాయకత్వంలోని ప్రత్యేక మండలి చూసుకునే అవకాశముందన్నారు. పరిపాలన కోసంఎలాంటి మండలి ఏర్పాటయినా.. దానికి అధినాయకుడిగా తాలిబన్ సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుంద్‌జాదా ఉంటారన్నారు. ఆయన కనుసన్నల్లోనే తాము నడుచుకుంటామన్నారు. అఖుంద్‌జాదా ప్రస్తుతం కాందహార్‌లో ఉన్నారు. ఆయన, బరాదర్ త్వరలోనే కాబుల్‌లో బహిరంగంగా కనిపించే అవకాశాలున్నాయి.
స్వాధీనం చేసుకున్న రక్షణ సామగ్రితో కవాతు
అఫ్గాన్ నుంచి అమెరికా సైన్యం(Afghanistan US Troops) వెళ్లిపోవడంతో తాలిబన్లలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. అగ్రరాజ్య బలగాలు వదిలి వెళ్లిన రక్షణ సామగ్రి, అఫ్గాన్ సైన్యం నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను వారు కాందహార్‌లో బుధవారం బహిరంగంగా ప్రదర్శించారు. వాటితో కవాతు నిర్వహించారు. ఆకుపచ్చని హమ్వీ వాహనాలు, బ్లాక్ హాక్ హెలికాప్టర్ వంటివి వారి వద్ద కనిపంచాయి.
అమెరికా నిర్లక్ష్యం.. జాగిలాల ఆకలి కేకలు
అఫ్గాన్‌లో తరలింపు చర్యల్ని హడావుడిగా ముగించిన అమెరికా బలగాలు.. ఇన్నాళ్లూ అక్కడ తమకు సేవలందించిన జాగిలాలను నిర్లక్ష్యంగా వదిలి వెళ్లాయి. చేరదీసేవారు లేక అవి ఆకలితో అలమటిస్తున్నాయి. దీంతో అగ్రరాజ్య సైనికుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అఫ్గాన్‌లో మూడేళ్ల పాటు సేవలందించిన కొన్ని జాగిలాలను భారత దళాలు ఇటీవల సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చాయి. ఇరు దేశాల తీరును పోలుస్తూ.. నెటిజన్లు అమెరికాపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. అగ్రరాజ్య బలగాలు వదిలేసి వెళ్లిన జాగిలాలను అమెరికాకు చేర్చేందుకు ‘వెటరన్ షీప్‌డాగ్స్’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రయత్నిస్తోంది.
ఇవీ చూడండి: Afghanistan US Troops: అమెరికా తొందరపాటు- శునకాల ఆకలికేకలు!
Afghan Crisis: అఫ్గాన్‌లో ఆకలి సంక్షోభం- నిండుకున్న ఆహార నిల్వలు!