మయన్మార్ బహిష్కృత నేత ఆంగ్‌సాన్ సూకీ కోర్టు ముందు సోమవారం ప్రత్యక్షంగా హాజరయ్యారని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. సైనిక ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత కోర్టు ముందు ప్రత్యక్షంగా హాజరవడం ఇదే మొదటిసారి. నెపిడా నగరంలోని సెంట్రల్ కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానానికి రావడానికి ముందు ఆమె తన న్యాయవాదుల బృందాన్ని కలుసుకున్నారు.
సూకీ ఆరోగ్యంగా ఉన్నారని ఆమె న్యాయవాది మిన్ మిన్ సోయి తెలిపారు. దేశ ప్రజల క్షేమాన్ని సూకీ కోరుకుంటున్నారని వెల్లడించారు. మయన్మార్ ప్రజలు ఉన్నంత వరకు నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రెసీ (ఎన్ఎల్డీ) పార్టీ ఉంటుందని ఆమె చెప్పినట్లు పేర్కొన్నారు.
తనపై పలు క్రిమినల్ అభియోగాలు నమోదైన తర్వాత ఇప్పటివరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే న్యాయస్థానం ముందు సూకీ హాజరయ్యారు. తన న్యాయవాదులతో కలిసి ప్రత్యక్షంగా హాజరయ్యేందుకు ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు ఆ దేశ సైనిక ప్రభుత్వం.
ఆరు కేసులకు సంబంధించి సోమవారం విచారణ జరిగింది. 2020 ఎన్నికల్లో కరోనా నిబంధనల మధ్య విపత్తు నిర్వహణ చట్టం ఉల్లంఘన, వాకీ టాకీల అక్రమ దిగుమతి, లైసెన్స్ లేని రేడియోల వాడకం, ప్రజలను రెచ్చగొట్టే సమాచారాన్ని వ్యాపింప చేయటం వంటి ఆరోపణలపై నమోదైన వ్యాజ్యాలపై విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: జర్నలిస్ట్ మీదకు యుద్ధ విమానం పంపి అరెస్ట్