కరోనా.. ప్రపంచ దేశాలపై పంజా విసురుతూనే ఉంది. ఇప్పటి వరకు 29 లక్షల 43వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దాదాపు 2 లక్షల 4 వేల మంది మరణించారు. మహమ్మారి బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 8 లక్షల 42 వేలు దాటింది.
స్పెయిన్‌లో 44 రోజుల తర్వాత..
స్పెయిన్‌లో కరోనా మరణాలు సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఆదివారం 288 మంది మృతి చెందగా.. గత 5 వారాల్లో ఇదే అత్యల్ప సంఖ్య కావటం గమనార్హం. అంతేకాకుండా లాక్‌డౌన్ నిబంధనల్లో స్వల్ప సడలింపులతో 44 రోజుల తర్వాత స్పెయిన్ వీధుల్లో చిన్నపిల్లలు సందడి చేశారు. కాసేపు అలా బయటతిరిగారు.
సింగపూర్‌లో 13 వేలు దాటిన కేసులు..
ఆసియా దేశాల్లోనే సింగపూర్‌లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే 931 కేసులు నమోదు కాగా.. మొత్తం వైరస్ బారిన పడిన వారి సంఖ్య 13 వేలు దాటినట్లు ఆ దేశ యంత్రాంగం ప్రకటించింది. ఇప్పటివరకు అక్కడ 12 మంది ప్రాణాలు విడిచారు.
కేవలం 10 కేసులే..
దక్షిణ కొరియా.. కరోనాపై పైచేయి సాధిస్తోంది. దేశవ్యాప్తంగా ఇవాళ కేవలం 10 మందికే వైరస్ సోకినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు 10,728 మందికి వైరస్ సోకగా.. 242 మంది మృతి చెందారు. మరో 8,717 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
మసీదులకు దూరంగా ఉండండి...
పాకిస్థాన్‌లో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోన్న వేళ రంజాన్ మాసంలో భక్తులెవ్వరూ మసీదులో ప్రార్థనలకు వెళ్లవద్దని ప్రభుత్వాధికారులు, వైద్య నిపుణులు కోరుతున్నారు. ఇవాళ ఒక్కరోజే పాక్‌లో 783 మంది వైరస్ బారిన పడగా.. దేశవ్యాప్తంగా మొత్తం 12,579 బాధితులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో 269 మంది మృతి చెందారు.
ఇరాన్‌లో 90 వేలు+
ఇరాన్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో వెయ్యి మందికిపైగా కరోనా బారినపడగా.. మరో 60 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా 90,481 మంది బాధితులున్నారు.
ఆఫ్రికా ఖండంలో 30 వేల కేసులు..
ఆఫ్రికాలోని మొత్తం 54 దేశాల్లో కలిపి కరోనా బాధితుల సంఖ్య 30 వేలు దాటినట్లు అధికారులు ప్రకటించారు. ఆదివారం నాటికి 1,374 మంది మరణించారు. ఉత్తర ఆఫ్రికాలోని ఈజిప్ట్‌లో 4,319, మొరాకోలో 3,857, అల్జీరియాలో 3,256 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా దక్షిణాఫ్రికాలో 4,361 మందికి వైరస్ సోకింది.
రష్యాలో కేసుల పెరుగుదల..
రష్యాలో రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. ఇవాళ మరో 6 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 81 వేల మందికి పైగా వైరస్ సోకింది. మొత్తం 747 మంది మరణించగా.. దాదాపు 6,800 మంది కోలుకున్నారు.
మే 7 వరకు లాక్‌డౌన్ పొడిగింపు...
నేపాల్‌లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోన్న వేళ ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మరో 10 రోజులు (మే 7 వరకు) పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
ఇతర దేశాల్లో...
బెల్జియంలో ఇవాళ కొత్తగా నమోదైన కేసులతో కలిపి 46,134 మందికి వైరస్ సోకింది. ఇప్పటి వరకు 4,057 మంది మృతి చెందారు. నెదర్లాండ్స్‌లో 24 గంటల్లో 655 కేసులు నమోదుకాగా మొత్తం 37,845 మంది బాధితులు ఉన్నారు. బ్రెజిల్‌లో మొత్తం కేసుల సంఖ్య 59,324కు చేరింది.