సౌదీకి చెందిన ఓ యువతి.. కాఫీ పెయింటింగ్‌లో గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. కాఫీ రేణువులతో రూపొందించిన ఈ పెయింటింగ్.. ప్రపంచంలోనే అతి పెద్ద కాఫీ ఆర్ట్‌గా రికార్డులకెక్కింది. ఫలితంగా సౌదీ తరఫున ఈ ఘనత అందుకున్న తొలి మహిళగానూ రికార్డులకెక్కింది ఓహుద్ అబ్దుల్లా అల్మాల్కీ.
అల్మాల్కీ.. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఏడుగురు ప్రముఖుల చిత్రాలను గీసింది. ఇందులో సౌదీ యువరాజు అబ్దుల్లాజిజ్ బిన్ అబ్దుల్ రహ్మాన్, యూఏఈ రాజు షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ల పెయింటింగ్ అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ఇందుకోసం ఆమె మొత్తం 4.5 కిలోల కాఫీ పౌడర్‌ను వాడారట. ఈ మిశ్రమానికి కాస్తంత నీటిని కలిపి మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారామె.
4 రకాల పౌడర్లు.. 45 రోజులు..
220.968(15.84మీ. పొడవు X 13.95మీ. వెడల్పు) చదరపు మీటర్ల కాటన్ వస్త్రంపై ఈ పెయింటింగ్ వేశారు అల్మాల్కీ. ఈ చిత్రాన్ని రూపొందించేందుకు సుమారు 45రోజులు పట్టిందన్నారు ఈ పెయింటర్. నాలుగు రకాల కాఫీ పొడిని వాడుతూ.. రకరకాల బ్రష్‌లతో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశానని చెప్పుకొచ్చారామె.
పిన్న వయసులోనే పెయింటింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు అల్మాల్కీ. గతంలో పలుమార్లు గిన్నిస్ రికార్డులకు యత్నించిన ఆమె.. ఈ ప్రయత్నం ద్వారా తన మైలురాయిని అందుకున్నారు.
ఇదీ చదవండి: తైవాన్ ఆక్రమణకు చైనా సన్నాహాలు?