కార్చిచ్చుతో అతలాకుతలం అవుతున్న ఆస్ట్రేలియాకు వర్షం పడి ఊరట లభించిందనుకుంటే... ఇప్పుడు మరో ముప్పు ముంచుకొచ్చింది. కొన్ని కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో వర్షం పడటం వల్ల అంతా జలమయమైంది. ఎన్నడూ లేనంతగా వర్షం పడటం వల్ల భారీ వరదలు వచ్చే ప్రమాదం ఉంది.
క్వీన్స్లాండ్ రాష్ట్రంలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. వానల ధాటికి ఇప్పటికే చాలా ప్రాంతాలు నీటమునిగాయి. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. గత దశాబ్ద కాలంలో ఇంత ఎక్కువుగా వర్షం పడటం ఇదే తొలిసారి.
కార్చిచ్చు
కార్చిచ్చు ఉద్ధృతంగా ఉన్న దక్షిణ, ఆగ్నేయ ఆస్ట్రేలియాలో ఎలాంటి వర్షమూ లేదు. విక్టోరియా, న్యూ సౌత్ వేల్స్లో అగ్ని జ్వాలలు ఇంకా ఎగిసిపడుతూనే ఉన్నాయి. దాదాపు 75 చోట్ల భారీ ఎత్తున దావాగ్ని రగులుతూనే ఉందని అధికారులు తెలిపారు.
అపార నష్టం
కార్చిచ్చు ధాటికి ఇప్పటివరకు 2 వేలకుపైగా ఇళ్లు, 10 మిలియన్ల ఎకరాల అడవి కాలి బూడిదయ్యాయి. 27 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి : 'నోట్లపై లక్షీదేవి ఉంటే 'రూపాయి' చల్లగా ఉంటుంది'