మయన్మార్‌లో సైనిక తిరుగుబాటుపై నిరసనలు రోజు రోజుకు ఉద్ధృతంగా మారుతున్నాయి. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడం, కాల్పుల జరపడం వల్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో సాయుధ దళాలను ఎదుర్కొనేందుకు తమదైన శైలిలో వ్యూహాలు రచిస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు నడుం బిగించారు నిరసనకారులు.
రక్షణ కవచాలతో..
పోలీసులతో ఘర్షణల్లో సుమారు 60 మంది వరకు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో.. రక్షణ కవచాలతో ఉద్యమంలో పాల్గొంటున్నారు ప్రజలు. సొంతంగా తయారు చేసిన రక్షణ కవచాలు, హెల్మెట్లు ధరించి.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పోలీసు వాహనాలు వేగంగా దూసుకురాకుండా రోడ్లపై ఇటుకలను పేర్చటం వంటివి చేస్తున్నారు.
దేశంలోని రెండో అతిపెద్ద నగరం మాండలేయలో బుధవారం వేలాది మంది ఆందోళనకారులు.. వీధుల్లోకి చేరి నిరసనలు చేశారు. ఉద్యమ చిహ్నమైన 'మూడు-వేళ్లతో సెల్యూట్' చేస్తున్న చిత్రాలు ఉన్న రక్షణ కవచాలను పట్టుకుని కనిపించారు. పోలీసులతో ఎలాంటి ఘర్షణ జరగకుండా.. వారు వచ్చే కొద్ది నిమిషాల ముందే వీధుల్లో కవాతు నిర్వహించి ముగించారు. మరో బృందం ద్విచక్రవాహన ర్యాలీ చేపట్టింది.
నిర్బంధంలోని వారిపై వేధింపులు!
ఉద్యమంలో పాల్గొన్న వారిని సైన్యం నిర్బంధించి, వేధిస్తోందని ఆరోపించింది న్యూయార్క్‌కు చెందిన మానవ హక్కుల పర్యవేక్షణ కమిటీ. మంగళవారు కస్టడీలోకి తీసుకున్న పాఠశాల ప్రిన్సిపల్‌ను తీవ్రంగా గాయపరిచి హత్య చేసినట్లు చెప్పింది. ఇటీవలి కాలంలో ఇలా జరగటం రెండోసారని పేర్కొంది. రాత్రివేళల్లో పరిస్థితులు ప్రమాదంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసులు, సైనిక బృందాలు స్థానికులను భయపెట్టేందుకు కాల్పులు జరపటం, అరెస్ట్‌లు చేస్తున్నట్లు తెలిపింది.
మయన్మార్‌లో ఇప్పటి వరకు సుమారు 1930 మందిని అరెస్ట్ చేశారు. అందులో పదుల సంఖ్యలో జర్నలిస్టులు ఉన్నారు.
పోలీసుల ముందు మోకరిల్లిన నన్
మయన్మార్ సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా గత నెలలో మైట్కినాలో జరిగిన నిరసనల సందర్భంగా పోలీసుల ముందు మోకరిల్లిన ఓ సన్యాసిని.. మరోమారు అదే విధంగా చేశారు. నిరసనకారులపై పోలీసులు దాడి చేయకుండా నిరోధించేందుకు ఇద్దరు అధికారుల ముందు మోకరిల్లారు సిస్టర్ ఆన్ రోజాను టాంగ్. అధికారులు సైతం ఆమెకు గౌరవం ఇస్తూ.. మోకాళ్లపై కూర్చున్నారు. నిరసనకారులపై కాల్పులు, లాఠీ ఛార్జ్ చేయొద్దని కోరారు సిస్టర్.
మైట్కినాలో పోలీసుల కాల్పుల్లో సోమవారం ఇద్దరు మరణించారు.
ఇదీ చూడండి: మయన్మార్ సైన్యం కాల్పుల్లో ఇద్దరు మృతి