భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న నైరుతి షత్ఖిరా జిల్లా ఈశ్వరీపుర్ గ్రామంలోని పురాతన జెశోరేశ్వరీ కాళీ ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సందర్శించారు. అమ్మవారి ఆలయంలో కలయ తిరిగిన మోదీ.. తరువాత ప్రత్యేక పూజలు చేశారు. బంగారు పూత పూసిన వెండి కిరీటాన్ని కాళీ మాతకు బహుకరించారు ప్రధాని. ఈ ఆభరణాన్ని సంప్రదాయ హస్త కళాకారుడు మూడు వారాలు శ్రమించి తయారు చేశారు.
"కాళీమాతకు ప్రార్థనలు చేసే అవకాశం నాకు లభించింది. సమస్త మానవ జాతిని కరోనా నుంచి విముక్తులను చేయాలి ప్రార్థించాను. ఈ ఆలయం సామాజిక, మత, విద్యా కార్యక్రమాలకు కూడా ఉపయోగపడుతుంది. తుపాను వంటి విపత్తుల్లో అందరికీ ఆశ్రయంగా పనిచేయాలని దీని నిర్మాణ బాధ్యతను భారత ప్రభుత్వం చేపట్టింది. ఈ అవకాశం కల్పించిన బంగ్లాదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు."
-నరేంద్ర మోదీ, భారత ప్రధాని
రెండు రోజుల బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న మోదీకి ఆలయ అధికారులు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. ఆలయం లోపలకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించిన ప్రధాని.. ప్రార్థనలు చేశారు. అర్చకుడు పూజులు చేసేటప్పుడు నేలపై కూర్చున్నారు.
భారత్, సరిహద్దు దేశాల్లో ఉన్న 51 శక్తి పీఠాల్లో జెశోరేశ్వరీ కాళీ ఆలయం ఒకటి. దీన్ని 16 వ శతాబ్దంలో హిందూ రాజు నిర్మించినట్లు ఇతిహాస గాథల్లో ఉంది.
మోదీ పర్యటన నేపథ్యంలో ఈ ఆలయం వద్ద బంగ్లాదేశ్ ప్రభుత్వం అదనపు భద్రతా చర్యలు తీసుకుంది.