పాకిస్థాన్‌లో మే 22న జరిగిన ఘోర విమాన ప్రమాదానికి.. కాక్‌పిట్ సిబ్బంది నిర్లక్ష్యం, ఎయిర్ కంట్రోల్ టవర్ కారణమని ప్రాథమిక దర్యాప్తులో స్పష్టమైంది. విచారణ కమిటీ అందించిన సంబంధిత నివేదికను.. ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు సమర్పించారు విమానయాన శాఖ మంత్రి. పైలట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) అధికారులే ఈ ప్రమాదానికి బాధ్యులు అని నివేదిక స్పష్టం చేసింది.
నివేదికలోని విషయాలు..
- తొలిసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించినప్పుడు విమానం వేగం, ఎత్తు రెండూ.. సూచించిన పారామితుల కంటే ఎక్కువగా ఉన్నాయి.
- ఘటనా సమయంలో ఎలాంటి సాంకేతిక లోపాలు తలెత్తలేదు.
- విమానం బ్లాక్ బాక్స్.. ఇప్పటివరకు సాంకేతిక లోపం సంభవించే అవకాశాన్ని సూచించలేదు.
పైలట్ తప్పుడు నిర్ణయం
'విమానం వేగం, ఎత్తు ఎక్కువగా ఉన్నప్పటికీ ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చింది కంట్రోల్ టవర్. ల్యాండింగ్ గేర్ల జామింగ్ గురించి పైలట్.. కంట్రోల్ టవర్‌కు సమాచారం అందించలేదు. అంతే కాకుండా రెండోసారి ల్యాండింగ్ కోసం ప్రయత్నించడం కూడా పైలట్ తప్పుడు నిర్ణయమే.' అని నివేదిక పేర్కొంది.
17 నిమిషాలు గాల్లోనే..
తొలిసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించిన తర్వాత 17 నిమిషాలు గాల్లోనే విమానం చక్కర్లు కొట్టింది. ఈ కీలక సమయంలోనే ఇంజిన్ దెబ్బతినట్లు తెలిపింది.
మే 22న లాహోర్ నుంచి బయలుదేరి కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాల్సిన పాక్ జాతీయ విమానం జనావాసాల్లో కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలోని ముగ్గురు చిన్నారులు సహా 97 మంది మరణించారు. ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
ఇదీ చూడండి: ట్రంప్ 'వీసా' దెబ్బతో నష్టం ఎవరికి? లాభపడేదెవరు?