నకిలీ బ్యాంకు ఖాతాల కేసులో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కో-ఛైర్మన్ అసిఫ్ అలీ జర్దారీ అరెస్టయ్యారు. ఇస్లామాబాద్‌లోని ఆయన నివాసంలో జర్దారీని ఆ దేశ అవినీతి నిరోధక శాఖ (న్యాబ్) అదుపులోకి తీసుకుంది.
నకిలీ ఖాతాల కేసులో ముందస్తు బెయిల్ గడువును పొడిగించాలని జర్దారీ, ఆయన సోదరి ఫర్యాల్ తల్పుర్ కోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌ను ఇస్లామాబాద్ హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో పోలీసులతో పాటు న్యాబ్ బృందం జర్దారీ ఇంటికి చేరుకుని అరెస్ట్ చేశారు. ఆయన సోదరి తల్పుర్ను ఇంకా అదుపులోకి తీసుకోలేదు.
ఈ కేసుపై విచారణ చేపడుతోన్న అవినీతి నిరోధక శాఖ (న్యాబ్) ఆదివారమే అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది.
నకిలీ బ్యాంకు ఖాతాల ద్వారా భారీ మొత్తంలో విదేశాలకు నగదు లావాదేవీలు జరిపినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. జర్దారీ, ఆయన సోదరితో కలిసి తప్పుడు బ్యాంకు ఖాతాలు సృష్టించి సుమారు రూ. 150 మిలియన్ల వరకు లావాదేవీలు జరిపినట్లు న్యాబ్ అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కథువా కేసులో ముగ్గురికి 25 ఏళ్లు జైలుశిక్ష