చైనా- పాకిస్థాన్ మధ్య సైనిక సహకారం పెరుగుతోందన్న వార్తల నడుమ మరో నిజం వెలుగులోకి వచ్చింది. పాక్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ (ఐఎస్ఐ) అధికారిని.. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) ప్రధాన కార్యాలయం కీలక పదవిలో నియమించినట్లు తెలుస్తోంది.
ఐఎస్ఐకి చెందిన కల్నల్ స్థాయి అధికారికి.. పీఎల్ఏ- కేంద్ర మిలిటరీ కమిషన్ (సీఎంసీ) సంయుక్త సిబ్బంది శాఖలో పోస్టింగ్ ఇచ్చారు. ఇరుదేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకునే నేపథ్యంలో మార్చిలో ఈ నియామకం జరిగినట్లు సమాచారం.
రెండు ప్రధాన కారణాలు..
ఇరు దేశాల మధ్య రెండు సమస్యలను పరిష్కరించే విషయంలో.. పరస్పర ఒప్పందానికి అనుగుణంగా ఈ నిర్ణయం జరిగింది.
- పాకిస్థాన్‌లో ఆశ్రయం పొందిన వీగర్ ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టడం.
- చైనా-పాక్ ఆర్థిక నడవా (సీపెక్) ప్రాజెక్టులో భాగస్వాములైన చైనా ఉద్యోగుల భద్రతకు భరోసా కల్పించటం.
ఎంతకాలమో చెప్పలేం..
ఈ విషయానికి సంబంధించి రీసర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (ఆర్ఏడబ్ల్యూ) మాజీ సహాయ కార్యదర్శి జయదేవ్ రణడే.. ఈటీవీ భారత్‌తో మాట్లాడారు.
"వీగర్ ముస్లింలపై నిఘా, సీపీఈసీలో తమ ఉద్యోగుల భద్రత కోసం పాక్ సాయాన్ని చైనా తీసుకుంటోంది. ఇది రెగ్యులర్ నియామకమే అయినా ఎన్ని రోజులు ఉంటుందనే స్పష్టత ఎవరికీ లేదు."
- జయదేవ్ రణడే, రా మాజీ సహాయ కార్యదర్శి
వీగర్ల సమస్య..
చైనాలోని జిన్జియాంగ్ రాష్ట్రానికి చెందిన మూలవాసులు వీగర్ ముస్లింలు. చాలా ఏళ్లుగా చైనా నుంచి స్వాతంత్య్రం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దశాబ్దాలుగా చైనా నుంచి వేల మంది వీగర్లు వలస వెళ్లి పాకిస్థాన్‌లో ఆశ్రయం పొందారు.
సీపీఈసీలో దాడులు..
మరోవైపు చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవా(సీపెక్) రెండు దేశాల మధ్య ఆర్థికంగా, వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాజెక్టు. దీనిపై చైనా ఇప్పటికే 62 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. చైనా ప్రజలపై స్థానికుల దాడులతో ఈ ప్రాజెక్టు ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది.
భారత్‌పైనా ప్రభావం?
ఈ రెండు అంశాల్లోనే కాకుండా భారత్ విషయంలోనూ తన ప్రయోజనాలను కాపాడుకునేందుకు పాక్ సాయాన్ని పొందుతోంది చైనా. తమ సైన్యంలో పాక్ ఐఎస్ఐకి అధికారిక పదవి ఇవ్వడం భారత్ దృష్టి పెట్టాల్సిన విషయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
2016లో చైనా సైన్యంలో అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారీ సంస్కరణలు తీసుకొచ్చారు. పీఎల్ఏకు సంయుక్త సిబ్బంది శాఖ కేంద్ర నాడీ వ్యవస్థలా పనిచేస్తుంది. సైన్య పరిపాలన, కార్యాచరణ అమలు, నిర్మాణాలు, తరలింపు, నియామకాలు, శిక్షణ తదితర అంశాలన్నీ ఈ శాఖ అధీనంలోనే ఉంటాయి. ఇందులోనే పాక్‌కు చోటిచ్చిందంటే ఆ రెండు దేశాల మధ్య సత్సంబంధాలు అర్థం చేసుకోవచ్చు.
(రచయిత- సంజీవ్ బారువా)