పాకిస్థాన్లో ఇటీవల ఓ హిందూ ఆలయంపై జరిగిన దాడులకు సంబంధించి అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది ఆ దేశ సుప్రీంకోర్టు. ఆ ఘటన.. పాకిస్థాన్ ప్రతిష్ఠను దెబ్బతీసిందని వ్యాఖ్యానించింది. దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. ఘటనకు కారకులైన వారిని అరెస్టు చేయాలని ఆదేశించింది.
దాడి జరుగుతున్న సమయంలో అక్కడున్న హిందూ కుటుంబాల రక్షణకే ప్రాధాన్యం ఇచ్చామని అధికారులు ఇచ్చిన సమాధానంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దాడిని కట్టడి చేయలేని అధికారులను తొలగించాలని సూచించింది.
ఇదీ జరిగింది..
పాకిస్థాన్ పంజాబ్ రాష్ట్రంలోని రహీమ్ యార్ ఖాన్ జిల్లా భోంగ్ నగరంలో ఉన్న హిందూ ఆలయంపై స్థానికులు బుధవారం దాడి చేశారు. ఆలయానికి నిప్పు పెట్టి విగ్రహాలను ధ్వంసం చేశారు. కొద్ది రోజుల క్రితం తలెత్తిన వివాదం తీవ్రమవడమే ఈ ఘటనకు కారణం.
ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఈ కేసును పాక్ సుప్రీంకోర్టు.. సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది.
ఇదీ చదవండి : వెయ్యేళ్లనాటి మహావిష్ణువు విగ్రహం స్వాధీనం