సిక్కు మత స్థాపకులు గురునానక్ 550వ జయంతి సమీపిస్తున్న వేళ.. సిక్కుల చిరకాల స్వప్నం నెరవేరుస్తూ కర్తార్‌పూర్ కారిడార్ నేడు తెరుచుకుంది. పాక్‌వైపు కారిడార్‌ను ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రారంభించారు. తొలి బ్యాచ్ ప్రయాణీకులకు స్వాగతం పలికారు. ఎయిర్‌బెలూన్లను ఎగురవేశారు.
గతేడాది వరకు కర్తార్‌పూర్ కారిడార్ ప్రాముఖ్యత గురించి తనకు తెలియదని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇరు దేశాల శాంతికి పాక్ కట్టుబడి ఉందన్న విషయానికి చారిత్రక కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభమే ఉదాహరణ అని పాక్ ప్రధాని అన్నారు. గురునానక్ దేవ్ 550 జయంతి ఉత్సవాల సందర్భంగా సిక్కు వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రారంభోత్సవంలో సిద్ధూ
పాక్ వైపు కారిడార్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ పాల్గొన్నారు. అనంతరం ప్రసంగించిన సిద్ధు ప్రధాని మోదీతో రాజకీయ వైరుధ్యాలున్నప్పటికీ.. కారిడార్ విషయంలో మోదీకి కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. ఈ విషయంలో తన మిత్రుడు ఇమ్రాన్ పాత్రను ఎవరూ తిరస్కరించలేరని సిద్ధూ వ్యాఖ్యానించారు.
వీసా లేకుండా..
వీసా అవసరం లేకుండా పాక్‌లోని కర్తార్‌పూర్‌లో ఉన్న దర్బార్ సాహిబ్‌ను దర్శించుకునే భాగ్యం నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. భారత్‌వైపు కారిడార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 500 మంది భారత యాత్రికులతో కూడిన మొదటి బ్యాచ్ కర్తార్‌పూర్ వెళ్లింది.
మొదటి బ్యాచ్‌లో ప్రముఖులు
మొదటి బ్యాచ్ భక్తుల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అకాల్ తక్త్ జాతేదార్ హర్‌ప్రీత్ సింగ్, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, సుఖ్బీర్ సింగ్ బాదల్, హర్ సిమ్రత్ కౌర్ బాదల్ సహా నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఉన్నారు. వీరితో పాటు శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ సభ్యులు, పంజాబ్‌కు చెందిన 117 ఎమ్మెల్యేలు, ఎంపీలు మొదటి బ్యాచ్‌లో కర్తార్‌పూర్ వెళ్లారు.
ఇదీ చూడండి: అయోధ్య తీర్పు దృష్ట్యా దేశవ్యాప్తంగా పటిష్ఠ భద్రత