నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలీ.. గురువారం మళ్లీ ఎంపికయ్యారు. గడువులోగా మెజార్టీని నిరూపించుకోవటంలో ప్రతిపక్ష పార్టీలు.. విఫలమవ్వగా ఆయన ఎంపిక అనివార్యమైంది. సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఓడిపోవటం వల్ల నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపక్ష పార్టీలను ఆ దేశ అధ్యక్షురాలు బైద్య దేవీ బండారీ అహ్వానించారు. ఈ క్రమంలో పార్టీ బాధ్యులతో మంగళవారం సమావేశమైన నేపాలీ కాంగ్రెస్ అధినేత షేర్ బహదూర్ దేవ్బా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు.
షేర్ బహదూర్ దేవ్బాకు పుష్ప కమల్ దాహల్ 'ప్రచండ' నేతృత్వంలోని నేపాల్ కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు సెంటర్(సీపీఎన్-ఎంసీ) మద్దతు ప్రకటించినప్పటికీ.. జనతా సమాజ్వాది పార్టీ(జేఎస్పీ-ఎన్)లోని మహంత ఠాకూర్ వర్గం.. మద్దతు ఉపసంహరించుకుంది. తద్వారా నేపాలీ కాంగ్రెస్.. ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మెజార్టీ దక్కించుకోలేకపోయింది. దీంతో తిరిగి కేపీ శర్మ ఓలీని ప్రధాని పదవిలో అధ్యక్షురాలు బైద్య దేవీ బండారీ నియమించారు. శుక్రవారం నుంచి ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
అయితే నియమాల ప్రకారం.. 30 రోజుల్లోగా నేపాల్ పార్లమెంటులో విశ్వాస తీర్మానంలో ఓలీ నెగ్గాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి: ప్రభుత్వం ఏర్పాటుకు పార్టీల పాట్లు- మళ్లీ ఓలీనే ప్రధాని?