ఊహాగానాలకు తెరదించుతూ ఉత్తరకొరియా అధినేత ప్రజల ముందుకు వచ్చారు. ఈ మేరకు దేశ అధికారిక మీడియా కేసీఎన్ఏ వెల్లడించింది. ఓ ఎరువుల కంపెనీ నిర్మాణం పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమానికి కిమ్ హాజరైనట్లు తెలిపింది. స్థానిక రోడోంగ్ సిన్మన్ వార్తాపత్రిక కూడా సంబంధిత ఫొటోలనూ విడుదల చేసింది. ఈ వేడుకకు కిమ్ సోదరి.. యో జోంగ్ కూడా హాజరైనట్లు సమాచారం.
దేశాధినేత కనిపించగానే ఒక్కసారిగా అక్కడివారంతా ఆశ్చర్యానికి గురయ్యారని, హుర్రే అంటూ నినదించారని న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
ఇదీ చూడండి: కొరియా నేతలకు 'అదృశ్యం' కొత్తేం కాదు!
అప్పటినుంచి వదంతులు...
ఏప్రిల్ 11 నుంచి బహిరంగంగా కనిపించక పోయేసరికి కిమ్ ఆరోగ్యంపై రకరకాల అనుమానాలు రేకెత్తాయి. కోమాలోకి వెళ్లిపోయినందువల్లే ఏప్రిల్ 15న కిమ్ తన తాత 108 జయంతి కార్యక్రమానికి హాజరు కాలేకపోయారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ అపోహలన్నింటికీ తెరదించుతూ కిమ్ ప్రజల ముందుకు వచ్చినట్లు కేసీఎన్ఏ పేర్కొంది.
కిమ్ ఆరోగ్యంపై కొద్దికాలంగా భిన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో చైనా ఇప్పటికే ఓ వైద్య బృందాన్ని ఉత్తర కొరియాకు పంపింది. మరోవైపు తాజా పరిస్థితులను అమెరికా నిశితంగా పరిశీలిస్తోందని ఆ దేశ అధికారులు తెలిపారు. కిమ్ మరణించినట్లు స్పష్టమైన నిఘా సమాచారమేదీ తమకు లేదని వారు వివరించారు. కిమ్ గురించి తనకు తెలుసునని, కానీ చెప్పనని ట్రంప్ చెబుతూ వస్తున్నారు.