మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీపై ఆ దేశ సైన్యం కొత్త ఛార్జిషీటును దాఖలు చేసినట్లు ఆమె న్యాయవాది వెల్లడించారు. ఈ ఛార్జీషీటు ద్వారా ఆమెను విచారణ లేకుండానే నిరవధికంగా నిర్బంధించవచ్చని సూకీ న్యాయవాది ఖిన్ మాంగ్ జా చెప్పారు. మయన్మార్ జాతీయ విపత్తు నిర్వహణ చట్టంలోని ఆర్టికల్ 25 కింద కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ సూకీపై ఛార్జిషీటును నమోదు చేసినట్లు తెలిపారు.
కొవిడ్ నిబంధనల ఉల్లంఘనలపై గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. అయితే, ఇటీవల కొలువు దీరిన సైనిక ప్రభుత్వం అక్కడి పీనల్ కోడ్‌లో మార్పులు చేసింది. దీని ప్రకారం సూకీని ఇప్పుడు నమోదు చేసిన ఛార్జిషీటు ద్వారా విచారణ లేకుండా నిరవధికంగా నిర్బంధించే అవకాశం ఉంది. సూకీపై ఇప్పటికే.. రిజిస్టర్ చేయని వాకీ టాకీలను ఉపయోగించారంటూ ఛార్జీషీటు నమోదైంది.
కొనసాగుతోన్న ప్రజాందోళనలు...
మరోవైపు.. సూకీని విడుదల చేయాలంటూ సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుత ప్రదర్శనలు చేపట్టారు అక్కడి ప్రజలు. హింసను అడ్డుకునే పేరుతో యాంగూన్ నగరంలో ఇంటర్నెట్ సేవలపై సైన్యం ఆంక్షలు విధించింది. నిరసనకారుల నుంచి సైన్యం డబ్బును స్వాధీనం చేసుకుంటుంది అనే ఊహాగానాలతో సెంట్రల్ బ్యాంక్ ప్రాంతాన్ని సైన్యం ముందస్తుగానే అదుపులోకి తీసుకుంది.
ఈ క్రమంలో ఆందోళనకారులు స్థానికంగా ఉండే ఐక్యరాజ్య సమితి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఐదు అంతకంటే ఎక్కువ మంది ప్రజలు గుమికూడకుండా.. సమావేశాలను ఏర్పాటు చేయకుండా నిషేధం విధిస్తూ సైన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు నిరసనగా సుమారు 3వేల మంది సూకీ పోస్టర్లను చేతిలో పట్టుకుని సైన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.