మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు వల్ల పదవులు కోల్పోయిన దాదాపు 300 వందల మంది సభ్యులు తమను తాము చట్టబద్ధమైన ప్రజా ప్రతినిధులుగా ప్రకటించుకున్నారు. తమనే మయన్మార్ ప్రభుత్వంగా గుర్తించాలని ఐక్యరాజ్య సమితి సహా ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ విధులను నిర్వర్తించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.
ఈ మేరకు ఫేస్‌బుక్ పేజీలో ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ సమాజాన్ని ఉద్దేశిస్తూ ఆంగ్‌సాన్ సూకీ నేతృత్వంలోని ఎన్ఎల్డీ పార్టీ ఓ లేఖను పోస్ట్ చేసింది. అక్రమంగా అధికారంలోకి వచ్చిన సైనిక ప్రభుత్వాన్ని గుర్తించొద్దని కోరింది. సైనిక ప్రభుత్వంపై ఆంక్షలు విధించడంతో పాటు దౌత్య సంబంధాలు నెరపరాదని సూచించింది.
ఏకం చేస్తాం: ఐరాస
మయన్మార్ చట్ట సభ్యుల లేఖపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజాన్ని ఏకం చేసేందుకు కృషి చేస్తామని సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ హామీ ఇచ్చారు. మయన్మార్ ప్రజాస్వామ్యంలోకి తిరిగి రావాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. సాధ్యమైనంత వరకు అన్ని స్థాయిల్లో సైనిక ప్రభుత్వంపై ఆంక్షలు విధించేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఎన్నికల ఫలితాలను గౌరవించి నిర్బంధంలో ఉన్న వారందరినీ విడుదల చేయాలని సైన్యానికి మరో మారు గుటెరస్ విజ్ఞప్తి చేశారు.