మయన్మార్‌లో సైనిక పాలకుల వేట నుంచి తప్పించుకుని, సురక్షితంగా తలదాచుకునేందుకు... ఆ దేశానికి చెందిన పలువురు ఎంపీలు, రాజకీయ నేతలు, పోలీసు అధికారులు మిజోరానికి వలస కడుతూనే ఉన్నారు. తాజాగా చిన్ హిల్స్ రాష్ట్రానికి చెందిన ఓ ఎంపీ తన కుటుంబంతో కలిసి ప్రైవేటు కారులో మయన్మార్ నుంచి మిజోరంలోని తుయ్‌పాంగ్ గ్రామం చేరుకున్నారు. ఇప్పటివరకూ ఇక్కడ ఆశ్రయం పొందుతున్న మయన్మార్ ఎంపీల సంఖ్య 17కు చేరింది. అంతర్జాతీయ సరిహద్దు నుంచి తుయ్‌పాంగ్‌కు 30 కిలోమీటర్ల దూరం. అయితే, తనను పట్టుకునేందుకు మయన్మార్ సైనికులు ప్రయత్నిస్తుండటంతో... ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, కారును ఎక్కడా ఆపకుండా సదరు ఎంపీ తుయ్‌పాంగ్‌కు చేరుకున్నారు.
స్వేచ్ఛా వాయువుల కోసం...
మయన్మార్ ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు చేసి, దేశాధ్యక్ష పదవి నుంచి ఆంగ్‌సాన్ సూకీని పదవీచ్యుతురాలిని చేసినప్పట్నుంచి... ఆ దేశంలో ప్రజాందోళనలు రగులుతూనే ఉన్నాయి. ఆందోళనకారులను అణచివేసేందుకు అక్కడి సైన్యం ఉక్కుపాదం మోపుతోంది. పలువురు ఆందోళనకారులను కాల్చి చంపింది. వేలాది మందిని నిర్బంధించింది. పలువురు ఎంపీలు, రాజకీయ నాయకులు, అధికారులను సైన్యం అరెస్టు చేస్తోంది. ఈ పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఎంపీలు, ప్రజాస్వామ్యవాదులు... మయన్మార్ నుంచి తప్పించుకుని, స్వేచ్ఛా వాయువుల కోసం భారత్‌లోని మిజోరానికి తరలి వస్తున్నారు. ఇప్పటివరకూ ఇలా వచ్చిన సుమారు 2,200 మందికి రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది.
ఇదీ చూడండి: 'మయన్మార్ నిరసనల్లో 51 మంది చిన్నారులు మృతి'