ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రత నమోదైనట్టు అమెరికా భౌగోళిక సర్వే(యూఎస్జీఎస్) ప్రకటించింది. భూప్రకంపనలకు బయపడ్డ ప్రజలు భవనాలు, నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు. దేశంలో అధిక జనాభా ఉన్న జావా దీవిలో సంభవించిన భూకంపం వల్ల సునామీ ఏర్పడే అవకాశముందని భావించిన అధికారులు... హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని గంటల అనంతరం సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు.
10 అడుగుల ఎత్తుతో...
జకార్తాకు నైరుతి వైపు ఉన్న లబౌన్ నుంచి 150 కిలీమీటర్ల దూరంలో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ నేపథ్యంలో జావా- సుమాత్రా దీవుల మధ్య ఉన్న సుంద స్ట్రయిట్ ప్రాంతంలో మూడు మీటర్ల(10 అడుగులు) ఎత్తు గల సునామీ వచ్చే అవకాశముందని అధికారులు భావించారు. ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలను గుర్తించి... తక్షణమే వాటిని ఖాళీ చేయాలని స్థానికులను హెచ్చరించారు. నిర్దేశిత సమయంలో ఎలాంటి ఘటన చోటుచేసుకోకపోవడం వల్ల ఊపిరి పీల్చుకున్న అధికారులు... సునామీ హెచ్చరికలను ఉపసహరించుకున్నారు.
2018 డిసెంబరులో ఇదే ప్రాంతంలో అగ్నిపర్వతం బద్ధలై సునామీ ఏర్పడింది. ఈ ఘటనలో 400 మంది ప్రాణాలు కోల్పోయారు.
2004 ప్రళయం...
డిసెంబర్ 26, 2004లో 9.1 తీవ్రతతో ఏర్పడిన సునామీని ఆ దేశ ప్రజలు ఎన్నటికీ మరచిపోలేరు. ఈ భయానక విపత్తుకు 1లక్ష 17వేల మంది మరణించారు.
ఇదీ చూడండి:- ఆ స్వామి దర్శనం 40 ఏళ్లకోసారి 48 రోజులే..!