మయన్మార్లో పరిస్థితులు రోజురోజుకు దారుణంగా మారుతున్నాయి. సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా జరగుతున్న పోరాటాన్ని అణచివేసేందుకు మిలిటరీ అధికారులు తీవ్ర స్థాయిలో చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో దేశంలోనే అతిపెద్ద నగరమైన యాంగూన్లోని ఆరు టౌన్షిప్లలో మార్షల్ చట్టాన్ని అమలు చేసింది సైన్యం. నార్త్ డగూన్, సౌత్ డగూన్, డగూన్ సైకన్, నార్త్ ఒక్కలప, లైయింగ్ థార్ యార్, శ్వేపైత ప్రాంతాల్లో ఈ మార్షల్ చట్టాన్ని ప్రయోగించింది.
మయన్మార్లో ప్రజాస్వామ్యానికి తెరపడి ఆరు వారాలు గడుస్తోంది. అప్పటి నుంచి రాజకీయ నేతల్లో దాదాపు చాలా మంది నిర్బంధంలోనే ఉన్నారు. వారిపై వివిధ కేసులను మోపింది సైన్యం. అయితే మార్షల్ చట్టాన్ని ప్రయోగించడం మాత్రం ఇదే తొలిసారి.
నిరసనలపై ఉక్కుపాదం..
మరోవైపు ఆదివారం జరిగిన అల్లర్లలో 38మంది ప్రాణాలు కోల్పోయారు. ఇన్ని రోజులుగా జరుగుతున్న నిరసనల్లో ఇదే అత్యంత దారుణమైనది కావడం గమనార్హం. అటు నిరసనకారులపైనా ఉక్కుపాదం మోపుతోంది సైన్యం. అనేక ప్రాంతాల్లో అంతర్జాల సేవలను నిలిపివేసింది.
గస్తీ పేరుతో.. నివాసాలపై దాడికి దిగుతున్నారు అక్కడి పోలీసులు. రాత్రిపూట గాల్లోకి కాల్పులు జరుపుతూ బీభత్సం సృష్టిస్తున్నారు. ప్రజలను వారి ఇళ్ల నుంచి బయటకు తీసుకొచ్చి.. సోదాలు నిర్వహిస్తున్నారు. కొందరిని అదుపులోకి తీసుకుంటున్నారు. వీరిలో ఇద్దరు పోలీసు కస్టడీలోనే మరణించారు.
మయన్మార్లో ఫిబ్రవరిలో సైన్యం తిరుగుబాటు చేసింది. దేశాధినేత ఆంగ్ సాంగ్ సూకీని నిర్బంధించింది. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ.. ఈ చర్యలు చేపట్టింది.
ఇదీ చూడండి:- నిరసనకారుల నయా ట్రెండ్- రక్షణ కవచాలతో ఉద్యమం