శ్రీలంక ప్రధానిగా నేడు ప్రమాణం స్వీకారం చేయనున్నారు మహీంద రాజపక్స. ప్రధాని పదవికి విక్రమ సింఘే రాజీనామా చేసిన అనంతరం మహీందకు ఆ బాధ్యతలను అప్పగిస్తూ కీలక ప్రకటన చేశారు నూతన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స.
ఈరోజు మధ్యాహ్నం 1గంటకు మహీంద ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికలు జరిగేంత వరకూ అపద్ధర్మ ప్రభుత్వాన్ని నడపనున్నారు మహీందా.
అన్నదమ్ముల పాలన...
2005లో జరిగిన లంక అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించారు మహీంద రాజపక్స. అనంతరం ఆయన ప్రభుత్వంలోనే శ్రీలంక రక్షణ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు గొటబాయ రాజపక్స. నేడు తమ్ముడి పాలనలో అన్న మహీంద ప్రధాని బాధ్యతలు స్వీకరించనున్నారు.
ప్రస్తుత ప్రధాని విక్రమ సింఘే పదవికి రాజీనామా చేయడం వల్ల ప్రభుత్వ ఏర్పాటులో గొటబాయకు మార్గం సుగమమైంది. నిజానికి వచ్చే ఏడాది మార్చి వరకు విక్రమ సింఘే ప్రధానిగా కొనసాగవచ్చు. అయినప్పటికి అధ్యక్షుడు నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం చేసేందుకు పదవి నుంచి తప్పుకుంటున్నట్టు సింఘే స్పష్టం చేశారు.
2018లో...
2018 అక్టోబర్ 26న రణిల్ విక్రమ సింఘేకు షాక్ ఇస్తూ.. మహీంద రాజపక్సను ప్రధానిగా నియమించారు అప్పటి అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన. ఆయన నిర్ణయం దేశాన్ని రాజ్యాంగ సంక్షోభంలోకి నెట్టింది. అనంతరం సుప్రీం కోర్టు ఇచ్చిన రెండు కీలక ఆదేశాలతో ఆ పదవికి రాజీనామా చేశారు మహీంద. పార్లమెంట్ రద్దు చేస్తూ సిరిసేన తీసుకున్న నిర్ణయం అక్రమమని తేల్చింది సర్వోన్నత న్యాయస్థానం.
ఇదీ చూడండి:'ఆ ఖాతాలకు ఆధార్‌ను అనుసంధానించబోం'