పరస్పర రాజకీయవైరంతో దేశాధ్యక్షుడు, ప్రధానమంత్రి భద్రతను పట్టించుకోకపోవడం వల్లే ఈస్టర్ వేళ బాంబు పేలుళ్లు జరిగాయని పలువురు శ్రీలంక మంత్రులు, మీడియా ఆరోపించారు. అధ్యక్షుడు సిరిసేన, ప్రధానమంత్రి రనిల్ విక్రమసింఘేల మధ్య గతేడాది నుంచి రాజకీయ విభేదాలు నెలకొన్నాయి.
అయితే పేలుళ్ల గురించి నిఘా వర్గాల ద్వారా ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ అధ్యక్షుడు, ప్రధానమంత్రి తమకు తెలపలేదని శ్రీలంక కేబినెట్ అధికార ప్రతినిధి రజితా సేనరత్నే ఆరోపించారు. జాతీయ భద్రతతో కూడిన అంశాలతో అధ్యక్షుడు సిరిసేన, ప్రధాని నేతృత్వంలోని యూడీఎఫ్ ఆడుకున్నాయని ద ఐలాండ్ పత్రిక కథనం రాసింది.
జాతీయ తౌహీద్ జమాత్ (ఎన్టీజే) నుంచి ముప్పు పొంచి ఉందని అమెరికా, భారత్ నిఘా వర్గాలు లంక ప్రభుత్వాన్ని ఇటీవల హెచ్చరించాయి. నిఘా వర్గాల అంచనాల్ని నిజం చేస్తూ ఈస్టర్ సండే రోజున మూడు కాథలిక్ చర్చిలు, హోటళ్లపై ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఇందులో 321మంది ప్రాణాలు కోల్పోయారు. 500మంది గాయపడ్డారు.
ప్రభుత్వాధికారులెవరైనా పేలుళ్ల గురించి నిఘా వర్గాల సమాచారాన్ని విని సమర్థంగా తిప్పికొట్టేవారని పత్రిక అభిప్రాయపడింది. పదిరోజుల ముందుగా సమాచారం వచ్చినా ప్రభుత్వం తగు చర్యలేవీ తీసుకోలేదని ఆరోపించింది.
సర్వసైన్యాధ్యక్షుడు, రక్షణ శాఖ వ్యవహారాలు చూస్తున్న అధ్యక్షుడు సిరిసేన పేలుళ్ల సమయంలో విదేశాల్లో ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని ది ఐలాండ్ ఆక్షేపించింది. ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ దాడుల్ని తిప్పికొట్టకుండా ప్రభుత్వం ప్రపంచంలోనే చరిత్ర సృష్టించిందని సిలోన్ టుడే పత్రిక తూర్పారబట్టింది.
ఇద్దరు అన్నదమ్ములే కారణం: లంక పోలీసులు...
ఇద్దరు ముస్లిం అన్నదమ్ములే పేలుళ్లకు కారణమని శ్రీలంక పోలీసులు వెల్లడించారు. కొలంబోకు చెందిన సుగంధ ద్రవ్యాల వ్యాపారి కుమారులు ఆత్మాహుతి దాడులకు బాధ్యులని అభిప్రాయపడ్డారు. ఈ ఇద్దరు అన్నదమ్ములు ఎన్టీజేలో కీలకంగా పనిచేశారని సమాచారం. పేలుళ్లకు ఐసిస్ ఉగ్రసంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటన చేసినప్పటికీ, ప్రభుత్వం మాత్రం ఎన్టీజేనే కారణమని ఎత్తిచూపుతోంది. పేలుళ్లు జరిగిన హోటళ్లలో వీరిద్దరూ కెమెరా కంటబడినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: గుర్దాస్పుర్ నుంచి లోక్సభ బరిలో సన్నీ