కజకిస్థాన్‌లో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 100 మందితో అల్మటి ఎయిర్‌పోర్టు నుంచి విమానం టేకాఫ్ అవుతుండగానే ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో అందులో 95 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు.
బెక్ ఎయిర్ విమానం
బెక్ ఎయిర్ సంస్థకు చెందిన విమానం.. అల్మటి నుంచి రాజధాని నూర్ సుల్తాన్‌కు వెళ్తుండగా ఈ విషాద ఘటన జరిగింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానాశ్రయానికి సమీపంలోని రెండస్తుల భవనాన్ని ఢీకొట్టింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
అధ్యక్షుడి స్పందన
ఘటనపై స్పందించిన ప్రభుత్వం ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఓ కమిటీ నియమిస్తామని తెలిపింది. మృతుల కుటుంబాలకు దేశాధ్యక్షుడు కాసిమ్-జోమార్ట్ టొకాయేవ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గతంలోనూ ప్రమాదాలు...
అల్మటీలో గతంలోనూ ఘోర విమాన ప్రమాదాలు సంభవించాయి. 2013, జనవరి 29న కోక్‌షేటు నగరానికి బయలుదేరిన ఓ ప్రయాణికుల విమానం అదుపు తప్పి కుప్పకూలింది. ఈ ఘటనలో 20 మంది చనిపోయారు. 2012లో రక్షణశాఖకు చెందిన ఉన్నతాధికారులు ప్రయాణిస్తున్న ఓ సైనిక విమానం కూలిన ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు.