జపాన్ ప్రధానమంత్రి షింజో అబె తన పదవికి అధికారికంగా రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల రీత్యా పదవికి రాజీనామా చేయాలని ఇదివరకే నిర్ణయించుకున్న అబె.. లాంఛనంగా ఈ మేరకు లేఖ సమర్పించారు. అబెతో పాటు ఆయన మంత్రివర్గ రాజీనామాతో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు మార్గం సుగమమైంది. రాజీనామాకు ముందు చివరిసారిగా షింజో అబె కేబినెట్ సమావేశమైంది.
సుదీర్ఘకాలం పాటు జపాన్ ప్రధానిగా అబె కొనసాగారు. అబె కుడి భుజంగా ఉన్న చీఫ్ కేబినెట్ సెక్రటరీ యొషిహిదె సుగా జపాన్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి పార్లమెంటులో పూర్తి ఆధిక్యం ఉంది. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ ఓటింగ్లో విజయం సుగానే వరించనుంది.
రైతు బిడ్డ..
స్ట్రాబెరీలు పండించే రైతు కుటుంబంలో జన్మించిన సుగా.. స్వతహాగా రాజకీయనాయకుడిగా ఎదిగారు. 'వ్యవసాయ కుటుంబ నుంచి వచ్చినందున సాధారణ ప్రజల ప్రయోజనాల మేరకే పనిచేస్తానని' ఎన్నోసార్లు చెప్పారు. అబె అనుసరించిన దౌత్య, ఆర్థిక విధానాలను సుగా కొనియాడారు. అసంపూర్ణంగా మిగిలిపోయిన అబె విధివిధానాలను పూర్తి చేస్తానని వాగ్దానం చేశారు. కరోనాతో పోరాడి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే తన తొలి ప్రాధాన్యంగా నొక్కిచెప్పారు. సంస్కరణలపై దృష్టిసారించే వ్యక్తులనే కొత్త మంత్రివర్గంలో నియమిస్తానని వెల్లడించారు.
సవాళ్లివే!
జపాన్ కొత్త ప్రధానికి ఎన్నో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. తూర్పు చైనా సముద్రంలో పెత్తనం చెలాయిస్తున్న చైనాతో సంబంధాలు ఎలా సాగిస్తారనేది ఆసక్తికరం. కరోనా కారణంగా వాయిదా పడ్డ ఒలింపిక్స్ నిర్వహణ కూడా సుగా ముందున్న సవాలే. రాబోయే ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయితే.. వారితో సన్నిహిత సంబంధాలు కొనసాగించాల్సి ఉంటుంది.