సుదీర్ఘ కాలం జపాన్ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన నేతగా షింజో అబే రికార్డు సృష్టించారు. ప్రధానిగా నేటితో ఆయన 2 వేల 887 రోజులు పూర్తి చేసుకున్నారు. 1901 నుంచి 1913 వరకు ప్రధానిగా ఉన్న టారో కట్సురా నెలకొల్పిన రికార్డును అధిగమించారు.
2006 లో 52 ఏళ్ల వయసులో ప్రధాని పదవీ బాధ్యతలు స్వీకరించిన అబే.. అతి పిన్న వయసులో ఈ పదవి చేపట్టిన వ్యక్తిగానూ ఖ్యాతి గడించారు. చరిత్ర పుస్తకాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. భవిష్యత్ లక్ష్యాలపై దృష్టి సారించాలని రాజకీయ నిపుణులు అబేకు సూచించారు.
రాజ్యాంగ సవరణ..
షింజో అబే పదవీ కాలం 2021 సెప్టెంబర్ వరకు ఉంది. సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగడంపై స్పందించారు అబే. సవాళ్లను స్వీకరించేందుకు దేశం సిద్ధంగా ఉండాలని సూచించారు. జపాన్ రాజ్యాంగాన్ని సవరించాలన్న తన కోరికను మరోసారి వ్యక్తం చేశారు.
అబే పాలనపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. క్రోనిజం కుంభకోణంలో ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడం అబే ప్రతిష్ఠను తీవ్రంగా దెబ్బతీసింది.
ఇదీ చూడండి: చైనాకు షాక్.. హాంకాంగ్ నిరసనకారులకు అమెరికా మద్దతు