ఫోర్దోలోని నేలమాళిగలో ఉన్న అణు కేంద్రంలో యురేనియం శుద్ధిని ప్రారంభించినట్లు ఇరాన్ తెలిపింది. ఈ మేరకు అధ్యక్షుడు హసన్ రౌహానీ ఆదేశాలు జారీ చేసినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. అమెరికాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆయుధ శ్రేణి స్థాయిని 90 శాతానికి పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
దశాబ్దం క్రితమే యురేనియాన్ని 20 శాతం వరకు శుద్ధి చేయాలని ఇరాన్ నిర్ణయించింది. దీనిపై అప్పట్లో తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. దాదాపు యుద్ధం జరిగినంత పనైంది. 2015లో ఇరాన్‌కు పశ్చిమ దేశాలతో అణు ఒప్పందం ఖరారు కాగా పరిస్థితి సద్దుమణిగింది. అయితే ఈ ఒప్పందం నుంచి 2018లో అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ సర్కారు వైదొలిగింది. దీంతో రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్‌పై ఆంక్షలు విధించింది అగ్రరాజ్యం.
ఈ నేపథ్యంలో ఆంక్షల నుంచి ఉపశమనం కోసం ఐరోపాపై ఒత్తిడి పెంచేందుకు ఇరాన్ పార్లమెంటు.. యురేనియం శుద్ధి స్థాయిని పెంచాలని ఒక బిల్లును ఇటీవల ఆమోదించింది. దీనికి అనుగుణంగా 20 శాతం వరకు యురేనియాన్ని శుద్ధి చేయాలని ఇరాన్ తాజాగా నిర్ణయించింది. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) తనిఖీదారులకూ ఈ విషయాన్ని తెలియజేసింది.
ఇదీ చూడండి: జాక్ మా ఎక్కడ?.. 2 నెలలుగా బిలియనీర్ అదృశ్యం