అగ్రరాజ్యం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మూడేళ్ల తర్వాత తొలిసారి భారత్‌లో పర్యటించనున్నారు డొనాల్డ్ ట్రంప్. వచ్చేనెలలో జరగనున్న ఈ పర్యటనతో భారత్-అమెరికా మధ్య తలెత్తిన వాణిజ్య విభేదాలు తొలగిపోతాయా? ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రభావం భారత్‌పై ఎలా ఉంటుంది? వంటి పలు కీలక విషయాలపై ఈటీవీ భారత్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు వాషింగ్టన్ డీసీలోని బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్ సీనియర్ సభ్యులు తన్వి మదన్, ప్రముఖ వ్యూహకర్త డా. సి. రాజమోహన్. దిల్లీలో జరుగుతున్న రైసీనా సదస్సు సందర్భంగా మాట్లాడారు.
2019లో గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనాలని ట్రంప్‌ను భారత్ ప్రభుత్వం ఆహ్వానించినా.. అనివార్య కారణాల వల్ల కుదరదని తెలిపింది శ్వేతసౌధం.
ట్రంప్ వచ్చేనెలలో భారత్‌లో పర్యటిస్తారని మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ పర్యటన ఎంత కీలకం? గతేడాది రిపబ్లిక్ డేకు అతిథిగా రావాలన్న భారత్ వినతికి ట్రంప్ ఎందుకు నిరాకరించారు?
దేశ అధ్యక్షులకు ప్రణాళికా సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. అమెరికా అధ్యక్షులకు మరీ ఎక్కువ. వారు ఎక్కువగా పర్యటించరు. ప్రస్తుత అధ్యక్షుడు చాలా తక్కువ పర్యటిస్తారు. ట్రంప్ భారత్‌లో పర్యటించడం శుభపరిణామం. భారత్-అమెరికా మధ్య పెండింగ్‌లో ఉన్న వాణిజ్య, భద్రతా సహకారం వంటి పలు కీలక విషయాల్లో పురగోతి సాధించే వీలుంది. అధ్యక్షులు, ప్రధానులు పర్యటించినప్పుడు చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంతో పాటు కీలక ఒప్పందాలు జరుగుతాయి. ఇలాంటి పర్యటన మంచి ఫలితాలిస్తుంది. ఈ ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలున్నాయి. భారత్‌తో సంబంధాలు పటిష్ఠం చేసుకోవడం ట్రంప్‌కు దోహదపడుతుంది. అమెరికాతో భారత్ సంబంధాలు మరింత బలపడుతాయి.
-డా. సి. రాజమోహన్, వ్యూహకర్త.
ఇద్దరు దేశాధినేతలు బహుపాక్షిక కార్యక్రమాల్లో తరచూ కలుసుకోవండ ఎంత ముఖ్యం? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లతో ప్రధాని నరేంద్ర మోదీ సత్సంబంధాలున్నాయి. ట్రంప్‌తో మోదీకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? ఈ పర్యటన ట్రంప్‌కు ఎంత ముఖ్యం?
ఎప్పుడైనా ఇలాంటి పర్యటనలు ముఖ్యమే. వీటి ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తుంది. ఎన్నికలు జరిగే ఏడాది అయినందున ట్రంప్ భారత్‌తో వాణిజ్య ఒప్పందం కావాలనుకుని ఉండవచ్చు. అలాగే కొన్ని రక్షణ ఒప్పందాలు. ట్రంప్‌తో మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకు భారీ రక్షణ ఒప్పందాలు కుదుర్చుకున్న సందర్భాలు లేవు. రష్యాతో మాత్రం కుదుర్చుకున్నారు. ఏ పరిస్థితిలో ఏది ముఖ్యమో తెలుసుకోవాల్సి ఉంటుంది.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పర్యటన ఇందుకు భిన్నం. అమెరికా-భారత్ మధ్య సంస్థాగత సహకారం ఎప్పుడూ ఉంటుంది. ఇరు దేశాధినేతల మధ్య సమావేశాలు ముఖ్యమైనప్పటికీ.. వారు కలవకున్నా సహకారం అలాగే కొనసాగుతోంది. భారత్-అమెరికా మధ్య 2+2 చర్చల సంయుక్త ప్రకటనను గమినిస్తే ఇరు దేశాల మధ్య సహకారం ఏ స్థాయిలో ఉందో మీకు అర్థమవుతుంది. అగ్రనేతల పర్యటనలు జరగడం ముఖ్యమే.
ముందుస్తు ప్రణాళిక ప్రకారం జరిగే ఇలాంటి పర్యటనలు చూడటం ఆసక్తిగా ఉంటుంది. ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఊహించడం అసాధ్యం. ఇరుదేశాలు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి. ఒక్కోసారి మంచి జరగవచ్చు. కొన్నిసార్లు చెడు జరిగే వీలుంది.
-తన్వి మదన్, బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్ సీనియర్ సభ్యులు.
వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయా?
అమెరికా-భారత్ మధ్య వాణిజ్య సంబంధాల విలువ ప్రస్తుతం 150 బిలయన్ డాలర్లు. ఇది భారత్‌కు అత్యంత కీలకం. ఇది పెరుగుతూనే ఉంది. అమెరికన్లు, యూరోపియన్లతో వాణిజ్యపరంగా ముందుకుసాగడం భారత్‌కు చాలా ముఖ్యం. మేం వాణిజ్యానికి వ్యతిరేకం అనుకోవడం లేదు. మాకు కొందరు భాగస్వాములున్నారు. మా సొంతంగానే దీన్ని పూర్తి చేయాలనుకుంటున్నాం.
వ్యాపారం అంటే చర్చలు జరపడం సహా చర్చలను ఓ కొలిక్కి తీసుకురావడమే. చర్చలను ముగించే విషయంలో భారతీయులకు చాలా సవాళ్లు ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌ను అంతర్జాతీయ వాణిజ్య చర్చల్లో ఓ ప్రతికూల అంశంగా భావిస్తున్నారు.
కానీ చర్చలకు భారత్ సిద్ధంగా ఉందనే విషయం తెలియజెప్పాలి. నిబంధనలను అనుసరించి ఒప్పందాలను పూర్తి చేసుకోవడానికి సిద్ధమని చెప్పాలి. ఐరోపా, అమెరికా వంటి దేశాలతో భారత్ తప్పనిసరిగా ఒప్పందాలను పూర్తి చేసుకోవాలి.
-డా. సి. రాజమోహన్, వ్యూహకర్త.
డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనలో ఏమైనా భారీ ప్రకటనలు ఆశించొచ్చా?
పెద్ద అంశాలపై చర్చించకపోయినా కొన్ని చిన్న వ్యాపార ఒప్పందాలపై సంతకం చేసే అవకాశం ఉంది. ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందంపై చర్చలను పునఃప్రారంభించవచ్చు. రక్షణ రంగ ఒప్పందాలు జరిగే అవకాశం ఉండకపోవచ్చు. రక్షణ, భద్రత రంగాల్లో సహకరించుకోవడానికి ప్రభుత్వాలు ఒక్కసారి అంగీకరించుకుంటే... దానిపై చర్చలు జరుగుతూ ఉంటాయి. ఇదే వ్యాపారానికి, భద్రతా అంశాలకు ఉన్న తేడా.
ఇరు వైపులా దేశీయ ప్రయోజనాలు ఉంటాయి. వారందరూ రాజకీయ నాయకులే కాబట్టి ఒక్కోసారి సొంత పార్టీల్లోనే సమస్యలు వస్తాయి. వ్యాపారాన్ని సరళీకరణ ధోరణిలో చూడకుండా ఉంటున్నారని నా అభిప్రాయం.
-తన్వి మదన్, బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్ సీనియర్ సభ్యులు.
ఇరాన్ విదేశాంగ మంత్రి జావెద్ జరీఫ్ భారత పర్యటనకు వచ్చారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు సహా ఇరాన్‌తో భారత్‌కు ఉన్న సంబంధాల ఫలితం అమెరికాతో సంబంధాలపై పడుతుందా?
భారత్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంది. ఇరాన్ విదేశాంగ మంత్రి ఇక్కడ ప్రస్తావించిన అంశాలు కొంచెం కఠినమైన భాష ఉపయోగించే చెప్పారు. ఇలాంటి వేదికలపై అలా మాట్లాడాల్సింది కాదని కొందరి అభిప్రాయం. ఈ అంశం అమెరికా-ఇరాన్‌ల ద్వైపాక్షిమైనదని భారత విదేశాంగ మంత్రి జయ్శంకర్ ఇదివరకే స్పష్టం చేశారు. అంతర్జాతీయ సమాజానికున్న ఆందోళనలే భారత్‌కు ఉన్నాయని వెల్లడించారు. భారత్ విడుదల చేసిన ప్రకటనలో హత్య అన్న పదం కూడా ఉపయోగించలేదు. కేవలం రాజకీయ నేతను చంపడం అని మాత్రమే ప్రస్తావించారు.
చివరకు ఇరుదేశాలతో సంబంధాలను భారత్ సమానంగా నెరుపుతుంది. అయితే ఇరాన్‌తో పోలిస్తే అమెరికానే భారత్‌కు ముఖ్యం.
-తన్వి మదన్, బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్ సీనియర్ సభ్యులు.
పౌరులు ప్రయాణిస్తున్న విమానం నేలకూల్చిన తర్వాత ఇరాన్లో తలెత్తిన నిరసనలు ఆ దేశంలో నెలకొన్న సంక్షోభాన్ని ఎలాంటి మలుపు తిప్పుతాయి?
ప్రస్తుతం ఇరాన్లో కఠిన పరిస్థితులు ఉన్నాయి. అంతర్జాతీయంగా ఒంటరిగా మారుతోంది. ఆంక్షలతో అమెరికా ఒత్తిడి పెంచుతోంది. ఇరాన్‌తో స్నేహంగా మెలిగే భారత్ వంటి దేశాలను మధ్యవర్తిత్వం కోసం ఆహ్వానిస్తోంది. అయితే అమెరికా-ఇరాన్ మధ్య సంబంధాలను పెంపొందించడానికి భారత్ సిద్ధంగా ఉండకపోవచ్చు.
ప్రపంచంలో మనకు స్నేహితులు ఉన్నారు. వారు ఒకరికి మరొకరు స్నేహితులు కాకపోవచ్చు. మన స్నేహితులు పోట్లాడుకుంటున్నప్పుడు ఆ పరిస్థితుల్లో మనం సరిగ్గా ప్రవర్తించాలి.
ఆంక్షల విషయంలో అంతర్జాతీయ సమాజం వెంటే నడవాల్సి ఉంటుంది. చాబహర్ వంటి అంశాల్లో భారత్‌కు ఆసక్తి ఉంది. కాబట్టి అమెరికా కొంత వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఈ విషయాలు అమెరికా-భారత్ మధ్య సంబంధాలను పూర్తిగా విడగొట్టలేవు.
-డా. సి. రాజమోహన్, వ్యూహకర్త.
అమెరికా అనుకుంటున్నట్లు ఇరాన్లో పెరుగుతున్న సంక్షోభం వల్ల ఆ ప్రాంతంలో పాకిస్థాన్ పోషించే పాత్ర పెరిగిందా?
లేదు. మనం పాకిస్థాన్ గురించి అతిగా ఆలోచిస్తున్నాం. కానీ ఇప్పుడు సమస్యంతా ఇరాన్, అరబ్ దేశాలది. పాకిస్థాన్ గల్ఫ్ దేశాలపై ఆధారపడి ఉంది. కానీ ఇరాన్ గల్ఫ్ పొరుగుదేశం. వారు వైరుధ్యాలను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వారు(పాకిస్థాన్) నిర్ణయాత్మక శక్తిగా పరిగణించడానికి సమీపంలో కూడా లేరు.
-డా. సి. రాజమోహన్, వ్యూహకర్త.