భారత్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తూ దాయాది పాకిస్థాన్ మరోమరు తన వక్రబుద్ధిని చాటుకుంది. భారత సైన్యాధిపతి బిపిన్ రావత్ పదేపదే చేస్తున్న ప్రకటనలు యుద్ధాన్ని ప్రేరేపించేలా ఉన్నాయని పాక్ సైన్యం వ్యాఖ్యానించింది. ఇది ప్రాంతీయ శాంతికి భంగం కలిగిస్తుందని పేర్కొంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాదుల నియంత్రణలో ఉందని బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలపై పై విధంగా స్పందించింది దాయాది దేశం.
ఉగ్రవాదుల నియంత్రణలో పీవోకే..
దిల్లీలో శుక్రవారం జరిగిన ఫీల్డ్ మార్షల్ కేఎమ్ కరియప్ప స్మారక ఉపన్యాసంలో బిపిన్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గిల్గిట్-బాల్టిస్థాన్, పీఓకేలు పాక్ దురాక్రమణలో ఉన్నాయని ఆయన అన్నారు.
"పీఓకేను పాక్ ఆక్రమించుకుంది కానీ అక్కడ దాని నియంత్రణ ఏమీ ఉండదు. పీఓకేను నిజానికి ఉగ్రవాదులు నియంత్రిస్తుంటారు."
- బిపిన్ రావత్, భారత సైన్యాధిపతి
ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్ము కశ్మీర్లో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని..అయితే అల్లర్లు సృష్టించడానికి పాక్ ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని రావత్ తెలిపారు.
పాక్ రియాక్షన్
పాకిస్థాన్ మిలిటరీ ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్.. రావత్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
"భారత సైన్యాధిపతి.. కొత్తగా ప్రతిపాదించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) పదవిని ఆశిస్తున్నారు. అందుకే పదేపదే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు."- ఆసిఫ్ గఫూర్.
తప్పుడు ఆరోపణలకు స్పందించం
గఫూర్ ప్రకటనపై భారత సైన్యం స్పందించలేదు. పాక్ తప్పుడు ఆరోపణలకు భారత సైన్యం స్పందించదని తేల్చి చెప్పారు ఓ అధికారి.
ఇదీ చూడండి: దిల్లీ టపాసుల మోతకు సుప్రీం, ప్రభుత్వం కళ్లెం