ఓ వైపు కరోనా మహమ్మారిని కట్టడి చేస్తూనే ఇతర దేశాలకు సాయం చేస్తోంది భారత్. ఇప్పటికే పలు దేశాలకు మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్ అందించింది. ఇప్పడు మిత్రదేశాలైన మాల్దీవులు, మారిషస్, మడగాస్కర్, కొమొరోస్, సీషెల్స్ కు అవసరమైన మందులు, ఆహార పదార్థాలు సహా వైద్య బృందాలను పంపించింది.
ఆయా దేశాల వినతి మేరకు భారత నేవీకి చెందిన కేసరి నౌకను వైద్య సహాయం కోసం పంపించినట్లు విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. మిత్ర దేశాల సహాయం అందించేందుకు చేపట్టిన 'మిషన్ సాగర్' కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
" కొవిడ్-19 మహమ్మారిపై పోరులో సహాయం చేయాలని వారు చేసిన వినతి మేరకు.. భారత్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నౌకాదళ షిప్ కేసరిలో 5 దేశాలకు రెండు వైద్య సహాయ బృందాలు, కరోనా సంబంధిత ఔషధాలు, అసరమైన ఆహార పదార్థాలను పంపడం జరిగింది. మారిషస్, మడగాస్కర్, కొమొరోస్, సీషెల్స్‌కు ఔషధాలు, మాల్దీవులకు 600 టన్నుల ఆహార పదార్థాలను పంపింది."
- విదేశాంగ శాఖ
కొమొరోస్కు పంపిన వైద్య బృందం కరోనాతో పాటు డెంగ్యూ జ్వరంపై పోరాడేందుకు అక్కడి ప్రభుత్వానికి సాయపడనుందని తెలిపింది విదేశాంగ శాఖ. మారిషస్‌కు పంపిన వాటిలో ప్రత్యేకంగా ఆయుర్వేద ఔషధాలు, కొమొరోస్కు పంపిన వాటిలో హైడ్రాక్సీక్లోరోక్విన్ ఉన్నట్లు స్పష్టం చేసింది.