ప్రపంచం క్రిస్మస్ సంబరాల్లో మునిగి తేలుతుంటే.. హాంకాంగ్ నిరసనలతో ఉద్రిక్తంగా మారింది. సోషల్ మీడియా వేదికగా క్రిస్మస్ రోజున ర్యాలీకి.. పిలుపునిచ్చారు ఆందోళనకారులు. ఈ క్రమంలోనే నిరసనకారుల అన్ని డిమాండ్లను స్వీకరిస్తున్నట్లు హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ లామ్ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ప్రకటనను కూడా లెక్క చేయని వేలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు.
బుధవారం ఉదయం షాతిన్ న్యూ టౌన్ ప్లాజా నుంచి ప్రదర్శనగా వెళుతుండగా.. మాంకాక్ షాపింగ్ మాల్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ప్రదర్శన చేయడం నేరమని హెచ్చరించారు. ఆందోళనకారులు వినకపోవడం వల్ల వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మాంకాక్ షాపింగ్ మాల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.