వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ స్థలానికి మిలియన్ల డాలర్లు ఖర్చు పెడుతున్నారు హాంగ్‌కాంగ్ వ్యాపారవేత్తలు.
ది-సెంటర్లో యమరేటు!
ది-సెంటర్ హాంగ్‌కాంగ్ నగరంలోనే ఐదవ ఎత్తైన ఆకాశహర్మ్యం. అక్టోబర్ 2017లో ఓ హాంగ్ కాంగ్ ధనవంతుడు 5 బిలియన్ డాలర్లకుపైగా వెచ్చించి ఈ వాణిజ్య భవనాన్ని నిర్మించారు. ఇప్పుడు ఈ బిల్డింగ్ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కార్యాలయ భవనంగా అవతరించింది. ఇక్కడ పార్కింగ్ ధరలూ అంతే ఖరీదైనవిగా ఉంటాయి.
ఇక్కడ పార్కింగ్ స్థలం ధర అక్షరాలా 7.6 మిలియన్ల హాంగ్‌కాంగ్ డాలర్లు. అంటే సుమారు రూ. 7 కోట్లు. ఇంత భారీ ధరకు పార్కింగ్ స్థలానికి కొన్నవారి జాబితాలో ఇటీవలే చేరారు వ్యాపారవేత్త జానీ ష్యుంగ్ షూన్యీ.
"ద-సెంటర్లో చాలా మంది యజమానులు ఫైనాన్స్, ఇతర వ్యాపారాలలో ఉన్నారు. ఈ వ్యాపారవేత్తల కార్యాలయాల విలువతో పోల్చితే, ఈ పార్కింగ్ స్థలం ధర పెద్ద ఎక్కువేం కాదు."
-స్టాన్లీ పూన్, సెంటలైన్ కమర్షియల్ మేనేజింగ్ డైరెక్టర్
ఈ పార్కింగ్ స్థలం ధర... హాంగ్‌కాంగ్ వార్షిక తలసరి వేతనానికి 30 రెట్లు ఎక్కువ. అంత మొత్తం వెచ్చిస్తే లండన్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతంగా చెప్పే చెల్సియాలో సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ సొంతం చేసుకోవచ్చు. అయినా... తమ వాహనాలను సురక్షితంగా నిలిపేందుకు అడిగినంత ధర చెల్లిస్తున్నారు హాంగ్‌కాంగ్ వ్యాపారవేత్తలు.
మాంద్యం ఓవైపు...
ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో హాంగ్‌కాంగ్ కొద్ది నెలలుగా హోరెత్తుతోంది. వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయి... అక్కడి ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు అడుగులు వేస్తోంది. ఇలాంటి సమయంలో పార్కింగ్ కోసం ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేయడం... చర్చనీయాంశమైంది. హాంగ్‌కాంగ్‌లోని ఆర్థిక అసమానతలకు ఈ పరిణామం అద్దంపడుతోందన్నది కొందరు విశ్లేషకుల మాట.
ఇదీ చూడండి:తొలి మ్యాచ్‌లోనే 'ఠాక్రే' సూపర్ హిట్- 'కుర్చీ'యే టార్గెట్!