అఫ్గానిస్థాన్‌లో వరదల ఉద్ధృతికి 70 మంది మరణించారు. దేశంలోని ఉత్తర తూర్పు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వందలాది మంది గాయపడ్డారు. భారీగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద ప్రజలు చిక్కుపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
పర్వాన్ విలవిల..
పర్వాన్‌లో 66 మంది మరణించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వాహింద షాహ్కర్ పేర్కొన్నారు. 90 మందికిపైగా గాయపడ్డట్లు చెప్పారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పర్వాన్ రాష్ట్రంలో 300కు పైగా ఇళ్లు ధ్వంసమైనట్లు విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అహ్మద్ తమీమ్ అజీమి తెలిపారు. వేలాది మంది ఆచూకీ కోల్పోయినట్లు వెల్లడించారు. తూర్పు, ఉత్తర ప్రాంతాలకు వెళ్లే రహదారులు మూసుకుపోయినట్లు చెప్పారు. ప్రజలను కాపాడుతూనే రహదారులపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. తూర్పు నురిస్థాన్ రాష్ట్రంలో పంటలన్నీ నాశనమయ్యాయని.. ఉత్తర కపిసా, పంజ్‌షీర్, తూర్పు పక్తియా రాష్ట్రాల్లో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు.
అధ్యక్షుడి సంతాపం..
ఈ నేపథ్యంలో పర్వాన్ రాష్ట్రంలో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఆదేశించారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.
ఇదీ చదవండి- శిథిలాల కింద 26 గంటలు- ప్రాణాలతో బయటపడ్డ మహిళ