మీకు గుర్తుందా? కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న తరుణంలో ప్రజలు మాస్క్‌లను ధరించాలా? లేదా? అనే దానిపై విస్తృతంగా చర్చలు జరిగాయి. వైరస్ వ్యాపిస్తున్న కొత్తలో ఆన్లైన్లో చూసి కొంతమంది మాస్క్‌లను ఇంట్లోనే తయారు చేసుకున్నారు. అలా ఎవరైనా మాస్క్ పెట్టుకొని జనసమూహంలోకి వెళితే వారిని భిన్నంగా చూసేవారు. అప్పటివరకు వైరస్ నుంచి భయంతో కొంతమంది మాత్రమే వైరస్ నియంత్రణ చర్యలు పాటించగా.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు మాస్క్‌ను తప్పనిసరి చేసిన తర్వాత మెల్లిగా మాస్క్ వాడకం ఎక్కువైంది. ఆ తర్వాత క్రమంగా మాస్క్ లేకుండా జీవనం లేదనే పరిస్థితులు వచ్చాయి. కరోనా రెండో దశ తర్వాత కొన్ని దేశాల్లో మాస్క్ తప్పనిసరి నిబంధనను తొలగించినా.. ఇప్పటికీ కొన్ని దేశాల్లో మాస్క్ తప్పనిసరిగానే ఉంది.
2020లో ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్యలో మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న తరుణంలో మాస్క్ వాడకం మరింత పెరిగింది. ఈ సమయంలోనే మాస్క్ ధరించాల్సిన ఆవశ్యకతతో పాటు దాని వినియోగం చుట్టూ అలుముకున్న భయాలు, వాస్తవాలు ఇలా ఉన్నాయి.
వాస్తవం: కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మాస్క్‌ల కొరత ఉంది.
భయం: ఆస్పత్రుల్లో వైద్య సామాగ్రి అయిపోతుంది.
వాస్తవం: ఏ విధమైన లక్షణాలు లేని వారి ద్వారా కూడా వైరస్ సంక్రమిస్తుందని అత్యవసర పరిశోధన నిర్ధారించింది.
భయం: ఈ సమాచారంతో ప్రపంచమంతా ఆందోళనలకు దారితీసింది. తద్వారా మెడికల్ కిట్లు, మాస్క్‌ల కొరత రావొచ్చు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్యూహెచ్‌వో)తో పాటు ప్రముఖ వైద్య వేదికలూ ముసుగులపై వచ్చిన అసత్య వార్తలను ఖండించడం సహా ప్రజలంతా తప్పక మాస్క్ ధరించాలని పలువురు ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం చేశారు. ఇంట్లోనే తయారు చేసి ధరించాలంటూ సూచించారు. ఈ ప్రచారంతో మాస్క్‌ల పట్ల ప్రజల్లో ఉన్న అనుమానాలకు నివృత్తి కలిగించినట్లైంది.
చెక్ రిపబ్లిక్ దేశంలో తొలిసారి..
మాస్క్‌లు ధరించాలంటూ మొదట చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన పలువురు ప్రచారం చేశారు. తమ దేశంలోని ప్రజలకు మాస్క్‌ల పట్ల అవగాహన కల్పించడం సహా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగానూ అవగాహన కల్పించారు. కేేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అధ్యయనాన్ని వివరిస్తూ.. ఓ యూట్యూబర్ మాస్క్‌లను ఇంట్లోనే తయారు చేసుకోవాలని సూచించాడు. ఇలాంటి పరిస్థితుల్లో మాస్క్‌ల ఆవశ్యకాన్ని ప్రజలకు వివరించాడు. దీంతో పాటు ప్రజలంతా ఇంటికే పరిమితమై.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు. ఈ ప్రచారాన్ని #మాస్క్4ఆల్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ప్రజల్లో మరింత అవగాహన కల్పించారు. అది కొద్దిరోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది.
ఈ ప్రచారంతో ప్రపంచవ్యాప్తంగా మాస్క్‌ల తయారీ కేంద్రాలు నిరంతరాయంగా పనిచేశాయి. దానికి సంబంధించిన ప్రామాణిక కొలతలను పలు తయారీ సంస్థలూ పంచుకొని కలిసి కట్టుగా పనిచేయాలని జాతీయంగా ఆదేశాలు వచ్చాయి. వాటిని తొలుత ఫ్రంట్‌లైన్ వర్కర్లకు అందించారు. ఆ తర్వాత ప్రజలకు అందజేశారు.
2020 ఏప్రిల్ నాటికి దాదాపుగా 36 దేశాలు 'మాస్క్ ఫర్ ఆల్' అనే నిబంధనను తీసుకొచ్చాయి. బహిరంగ ప్రదేశాల్లో సంచరించే వారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆయా దేశాలు తమ ప్రజలకు సూచించాయి. 2020 మే 20 నుంచి సామాజిక దూరం పాటించలేని సమయంలో కచ్చితంగా మాస్క్ ధరించాల్సిందేనని కెనడా దేశం నిబంధన తీసుకొచ్చింది.
మాస్క్‌ల విలువ..
ప్రపంచవ్యాప్తంగా మాస్క్‌లు వాడకంలోకి వచ్చిన తర్వాత అనేక వార్తలు ఊపందుకున్నాయి. వాటి ఆవశ్యకాన్ని గుర్తించిన తర్వాత ప్రజల్లో జాగ్రత్త పెరిగింది. అదొక సామాజిక బాధ్యతగా.. తమను తాము రక్షించుకోవడం సహా ఇతరులకు వైరస్‌ను సంక్రమించకుండా ఉండేందుకు మాస్క్ ఓ ఆయుధమని ప్రచారాన్ని కల్పించారు. కాలక్రమేణ కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో అనేక దేశాల్లో మాస్క్ తప్పనిసరి ఆంక్షలను ఎత్తివేశారు. భారతదేశంలో అలాంటి పరిస్థితి ఎప్పటికి వస్తుందోనని ప్రజలంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇదీ చూడండి.. కరోనాతో పారా హుషార్.. టీకా వేసుకున్నా మాస్క్ తప్పనిసరి!