మాస్కులు ధరించకుండా.. ఫేస్ షీల్డ్‌లు మాత్రమే కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించలేవని తాజాగా అధ్యయనం ఒకటి వెల్లడిచేస్తోంది. షీల్డ్ ధరించిన వ్యక్తికి దగ్గర్లో ఎవరైనా తుమ్మితే.. ఆ ప్లాస్టిక్ స్క్రీన్ చుట్టూ ఉండే గాలి ప్రవాహంపై జపాన్ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఆ దేశంలోని ఓ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చేసిన తాజా అధ్యయనం ఫిజిక్స్ ఆఫ్ ప్లూయిడ్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. తుమ్మినప్పుడు వెలువడిన సుడివలయాలు..తుమ్ములోని సూక్ష్మకణాలను సంగ్రహించి ప్లాస్టిక్ స్క్రీన్ ద్వారా ముక్కు దగ్గరకు చేరుకుంటున్నాయని గుర్తించారు.
అధ్యయనంలోని వివరాలు..
'తుమ్మినప్పుడు వెలువడిన సుడి వలయాలు..తుమ్ములోని సూక్ష్మకణాలను సంగ్రహిస్తాయి. వాటిని ఫేస్ షీల్డ్ కింది, పై అంచు భాగాలకు తీసుకెళ్తాయి. షీల్డ్ ధరించిన వ్యక్తి దగ్గరకు వేగంగా (అంటే 0.5 నుంచి ఒక సెకను) ప్రయాణిస్తాయి. శ్వాస పీల్చే సమయంలోనే అవి చేరుకుంటే, ఆ వ్యక్తి వెంటనే ఆ బిందువులను లోపలికి శ్వాసిస్తారు' అని అధ్యయనకర్తల్లో ఒకరైన ఫుజియో అకాగి వివరించారు. తుమ్ముల ద్వారా వెలువడే వేగవంతమైన గాలి ప్రవాహం ద్వారా మాత్రమే కాకుండా, అప్పుడు వెలువడిన సుడి వలయాలు కూడా సూక్ష్మ కణాలను రవాణా చేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అవి అంచుల ద్వారా షీల్డ్ లోపలికి చేరుకుంటాయన్నారు. విడుదలైన బిందువుల్లో 4.4 శాతం ముక్కు సమీపంలోకి చేరుకుంటాయని తమ పరిశోధనలో స్పష్టమైందన్నారు. దానితో కొవిడ్ -19 వ్యాప్తిని నివారించడానికి ఫేస్ షీల్డ్‌లు మాత్రమే సరిపోవని తాము భావిస్తున్నామన్నారు. 'అందుకు అనుగుణంగా షీల్డ్‌లను మెరుగుపర్చి, ప్రజలకు వైరస్ దరిచేరకుండా సహకరించాలనుకుంటున్నాం' అని అకాగి తెలిపారు.