అఫ్గానిస్థాన్ భయానకంగా (Afghan crisis) మారిపోయింది. ప్రాణభయంతో దేశం నుంచి పారిపోతున్న వారిని కూడా ఉగ్రవాదులు వదలడంలేదు. కాబుల్ విమానాశ్రయంపై (Kabul airport blast) జరిగిన జంట ఆత్మాహుతి దాడుల్లో మృతుల సంఖ్య 108కు పెరిగింది. ఇందులో 13 మంది అమెరికా సైనికులు కాగా.. 95 మంది అఫ్గాన్ వాసులు. గాయపడిన వారి సంఖ్య 150కి చేరింది. ఈ విషయాన్ని కాబుల్ అధికారులు వెల్లడించినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక పేర్కొంది. ఈ దాడికి ఐఎస్‌ఐఎస్-ఖోర్సా బాధ్యత తీసుకుంది. మృతుల్లో 28 మంది తమ వారు కూడా ఉన్నారని తాలిబన్లు ప్రకటించారు.
తృటిలో తప్పించుకున్న సిక్కులు, హిందువులు!
గురువారం జరిగిన జంట పేలుళ్ల నుంచి ఆ దేశ సిక్కు, హిందూ మైనారిటీలు తృటిలో తప్పించుకున్నారు. పేలుళ్లు జరగడానికి కొన్ని గంటల ముందే దాదాపు 160 మంది అదే ప్రాంతంలో ఉన్నట్లు సిక్కు వర్గానికి చెందిన కొందరు తెలిపారు. వీరిలో 145 మంది సిక్కులు.. మరో 15 మంది హిందువులు. వీరంతా అఫ్గాన్‌ను విడిచివెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో విమానాశ్రయంలోకి వెళ్లడం కోసం సరిగ్గా పేలుళ్లు జరిగిన ప్రాంతంలోనే కొన్ని గంటల పాటు వేచి చూసినట్లు పేర్కొన్నారు.
పాక్ నుంచి తాలిబన్లు చాలా నేర్చుకున్నారు..
అఫ్గాన్ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమ్రుల్లా సలేహ్ ఈ ఘటనపై స్పందించారు. 'తాలిబన్లు- హక్కానీ నెట్‌వర్క్‌ల్లో ఐసిస్-కె మూలాలు ఉన్నాయి. కానీ తాలిబన్లు దీనిని తిరస్కరించడం ఎలా ఉందంటే.. ఒకప్పుడు క్వెట్టా షురా అనే మిలిటెంట్ సంస్థతో సంబంధాలు లేవని పాక్ చెప్పినట్లుంది. తన గురువు నుంచి తాలిబన్లు చాలా నేర్చుకొన్నారు' అని ఆయన ట్వీట్ చేశారు.
మరిన్ని దాడులు జరగొచ్చు..!
కాబుల్ విమానాశ్రయంపై మరిన్ని దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని అమెరికా సెంట్రల్ కమాండ్ జనరల్ ఫ్రాంక్ మెకన్జీ ప్రకటించారు. ఈ సారి రాకెట్లు.. వాహన బాంబులతో ఎయిర్‌పోర్టును లక్ష్యంగా చేసుకోవచ్చని హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
శ్వేత సౌధంపై అమెరికా పతాకాన్ని ఆగస్టు 30 సాయంత్రం వరకు అవనతం చేయనున్నారు. అఫ్గాన్‌లోని కాబుల్‌లో జరిగిన దాడిలో మృతిచెందిన వారికి సంతాపంగా ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు.
2011 తర్వాత ఇదే పెద్దదాడి..!
కాబుల్ విమానాశ్రయంపై జరిగిన దాడిలో 13 మంది అమెరికన్ సైనికులు మరణించారు. 2011 తర్వాత ఈ స్థాయిలో అమెరికన్ల మరణాలు నమోదైంది ఇప్పుడే. 2011 ఆగస్టు 6వ తేదీన ఉగ్రవాద శిబిరంపై అమెరికా చినూక్ హెలికాఫ్టర్ దాడికి దిగింది. ఈ సమయలో ఉగ్రవాదులు హెలికాప్టర్‌ను కూల్చివేశారు. ఈ ఘటన వార్దక్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఈ దాడిలో 22 నేవీ సీల్స్ సహా 30 మంది అమెరికా సిబ్బంది మరణించారు. మరో 8 మంది అఫ్గాన్ పౌరులు, ఓ అమెరికా జాగిలం కూడా మరణించింది.
విమాన రాకపోకలు పునఃప్రారంభం..
కాబుల్ ఎయిర్పోర్ట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నా.. కొద్ది గంటల విరామం తర్వాత విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. అత్యవసర చర్యల కింద ఎయిర్పోర్ట్ కార్యకలాపాలను ప్రారంభించారు అధికారులు. తాలిబన్ల ఆక్రమనతో వేల సంఖ్యలో అఫ్గాన్లు దేశం విడిచి వెళ్లేందుకు విమానాశ్రయం వద్ద పడిగాపులుగాస్తున్నారు.
ఇవీ చదవండి: