పాకిస్థాన్ కరాచీలో జనావాసాల మధ్య కుప్పకూలిన విమాన ప్రమాద ఘటనకు పైలట్ తప్పిదమే కారణమని ఆ దేశ పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. ప్రమాదానికి ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ రెండు సార్లు హెచ్చరించినా.. పైలట్ పట్టించుకోలేదని నివేదికలో పొందుపరిచింది. ఈ విషయం డాన్ న్యూస్ పేపర్లో ప్రచురితమైంది.
మే 22న లాహోర్ నుంచి బయలుదేరి కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాల్సిన పాక్ జాతీయ విమానం జనావాసాల్లో కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలోని ముగ్గురు చిన్నారులు సహా 97 మంది మరణించారు. ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
విమానాశ్రయానికి 25 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు సాధారణంగా ఉండాల్సిన ఎత్తులో కంటే ఎక్కువ ఎత్తులో విమానం ఉందని విమానయాన శాఖ నివేదికలో తెలిపింది. ఎత్తు తగ్గించుకోవాలని ఏటీసీ సూచించినా.. పైలట్ వినిపించుకోలేదని పేర్కొంది. 10 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు కూడా ఉండాల్సిన ఎత్తుకన్నా ఎక్కువ ఎత్తులో విమానం ఉందని.. మరోసారి సూచించినా పైలట్ పట్టించుకోలేదని వివరించింది.
మరోపైపు పాకిస్థాన్ పైలట్ల సమాఖ్య మాత్రం ఈ నివేదికతో విభేదిస్తోంది. తక్కువ వివరాలను పొందుపరిచారని ఆరోపిస్తోంది.
అయితే విమానంలోని బ్లాక్బాక్స్లో ఉన్న డేటాను విజయవంతంగా డౌన్లోడ్ చేశామని, దానిని విశ్లేషించాల్సి ఉందని ఫ్రెంచ్ బ్యూరో ఆఫ్ ఎంక్వైరీ అండ్ ఎనాలసిస్ ఫర్ సివిల్ ఏవియేషన్ సేఫ్టీ వెల్లడించింది. వాయిస్ రికార్డులన్నీ లభ్యమైనట్లు తెలిపింది. దీనిని పరిశీలించిన అనంతరం అసలు ఏం జరిగిందనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.