కరోనా వైరస్ మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్‌ను సాధ్యమైనంత తొందరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ముమ్మర కృషి జరుగుతోంది. ఇప్పటికే పది వ్యాక్సిన్‌లు తుది దశ ప్రయోగాలకు చేరుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా కొత్త సంవత్సరం నాటికే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు ప్రపంచ దేశాలు ప్రకటిస్తున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే పంపిణీ ప్రక్రియను చేపట్టే వ్యూహాల్లో ఆయా దేశాలు నిమగ్నమయ్యాయి. ఇక చైనా ఇప్పటికే భారీ స్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌లు ఏఏ దశలో ఉన్నాయో తెలుసుకుందాం.
స్పుత్నిక్-వి: నవంబరులో ఫలితాలు!
ప్రపంచవ్యాప్తంగా దాదాపు పది వ్యాక్సిన్‌లు తుది దశ మానవ ప్రయోగాల్లో ఉండగా.. వీటిలో రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్-వి ముందు వరుసలో ఉంది. ఇప్పటికే 40వేల వలంటీర్లపై ప్రయోగాలు జరుపుతోంది. ఇప్పటివరకు వ్యాక్సిన్ డోసు పొందిన 5 నుంచి 10 వేల మంది వలంటీర్ల ఫలితాలను నవంబర్ మొదటి వారంలో విడుదల చేసేందుకు గమలేయా ఇనిస్టిట్యూట్ సిద్ధమవుతున్నట్లు సంస్థ డైరెక్టర్ డెనిస్ లొగునొవ్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ తుది దశ ప్రయోగాలను మాస్కోలో సెప్టెంబర్ తొలి వారంలోనే ప్రారంభించింది. ప్రయోగాల్లో భాగంగా వలంటీర్లకు రెండు డోసులను ఇస్తోంది. మొదటి డోసు అనంతరం 21 రోజుల తర్వాత రెండో డోసు ఇస్తోంది. ఇలా తొలి బ్యాచ్‌లో వ్యాక్సిన్ తీసుకున్న దాదాపు 5 వేల నుంచి పది వేల మంది ఫలితాల విశ్లేషణ అక్టోబర్ చివరి నాటికి పూర్తికానుంది. అనంతరం, నవంబర్ తొలి వారంలో వ్యాక్సిన్ మధ్యంతర ఫలితాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
భారత్‌లోనూ అనుమతి..
రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ స్పుత్నిక్-వి ప్రయోగాలను భారత్‌లోనూ చేపట్టేందుకు డాక్టర్ రెడ్డీస్‌తో ఆర్‌డీఐఎఫ్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. మూడో దశ ప్రయోగాల అనుమతి కోసం డాక్టర్ రెడ్డీస్ దరఖాస్తు చేసుకుంది. అయితే, ఈ వ్యాక్సిన్ రెండు, మూడో దశ ప్రయోగాలను కలిపి చేయాలని నియంత్రణ సంస్థ సూచించగా మరోసారి దరఖాస్తు చేసుకుంది. తాజాగా వ్యాక్సిన్ తుది దశ ప్రయోగాలకు అనుమతి లభించినట్లు ఆర్‌డీఐఎఫ్ ప్రకటించింది. ప్రయోగాలతో పాటు భారత్‌లో పదికోట్ల వ్యాక్సిన్ డోసులను సరఫరా చేసేందుకు ఆర్‌డీఐఎఫ్‌తో డాక్టర్ రెడ్డీస్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.
ఆస్ట్రాజెనెకా: తిరిగి ప్రారంభమైన ప్రయోగాలు..
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ సహకారంతో ఆస్ట్రాజెనెకా తయారు చేసిన వ్యాక్సిన్ మూడోదశ ప్రయోగాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వీటి క్లినికల్ ట్రయల్స్ బ్రిటన్, అమెరికా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్‌తోపాటు మరికొన్ని దేశాల్లో కొనసాగుతున్నాయి. భారత్‌లో సీరం ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇక ఈ వ్యాక్సిన్ సానుకూల ఫలితాలు ఇస్తున్నట్లు లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైంది. అయితే, వలంటీర్లు స్వల్ప అనారోగ్యానికి గురైన దృష్ట్యా కొన్నిరోజుల క్రితం తాత్కాలికంగా ఆగిపోయిన ప్రయోగాలు చాలా దేశాల్లో తిరిగి ప్రారంభమయ్యాయి. అమెరికా, జపాన్‌లో మాత్రం ఇవి తిరిగి ప్రారంభం కాలేదు.
చైనా వ్యాక్సిన్‌లు: ఆ రెండు సురక్షితం!
వ్యాక్సిన్ రేసులో చైనా సంస్థలు కూడా ముందున్నాయి. ఇప్పటికే సినోవాక్, కాన్సినో బయోలాజిక్స్ సంస్థలు తయారు చేసిన టీకాలు సురక్షితంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సినోవాక్ బయోటెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ తుది దశ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు ఇచ్చినట్లు తాజాగా ప్రకటించింది. తుది దశ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా తొమ్మిది వేల మంది వలంటీర్లపై రెండు డోసులుగా ఈ టీకాను ఇవ్వగా ఎవరూ తీవ్ర అస్వస్థతకు గురికాలేదని ప్రకటించింది. బ్రెజిల్‌లో చివరి దశకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ ప్రాథమిక ఫలితాలు సోమవారం వెలువడగా.. ఈ దశకు చేరుకున్న తొలి వ్యాక్సిన్ తయారీ సంస్థగా సినోవాక్ నిలిచింది. బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ బయో మెడికల్ పరిశోధనా కేంద్రమైన సావో పాలో బుటాంటన్ ఇనిస్టిట్యూట్ సహకారంతో చైనా సంస్థ అక్కడ ప్రయోగాలు నిర్వహిస్తోంది.
మరో టీకా కాన్సినో బయోలాజికల్స్ టీకా ప్రయోగాలను సౌదీ అరేబియాతోపాటు రష్యాలో చేపడుతున్నారు. ఇప్పటికే సౌదీలో ఈ టీకా అత్యవసర వినియోగానికి సౌదీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చైనావ్యాప్తంగా వీటిని భారీ స్థాయిలో ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మోడెర్నా: డిసెంబర్‌లో అత్యవసర వినియోగానికి!
వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందున్న మోడెర్నా తయారుచేసిన టీకా ప్రయోగాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వీటి ఫలితాలు కూడా నవంబరులోనే వెల్లడవుతాయని సంస్థ సీఈఓ స్టీఫేన్ బాన్సెల్ వెల్లడించారు. అనంతరం వీటిని అత్యవసర వినియోగానికి అమెరికా ప్రభుత్వం డిసెంబర్‌లో ఆమోదం తెలిపే అవకాశాలున్నట్లు అమెరికా వార్తా సంస్థలు పేర్కొన్నాయి.
ఫైజర్: అక్టోబర్‌లోనే స్పష్టత!
జర్మనీ కంపెనీ బయోఎన్‌టెక్ సహకారంతో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ సురక్షితమైందా? కాదా? అనే విషయం అక్టోబర్ చివరినాటికే తేలే అవకాశాలున్నాయని ఫైజర్ ప్రకటించింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 44వేల మందిపై జరుగుతోన్న ప్రయోగాల సమాచారం వచ్చే నెల నాటికి అందుతుందని పేర్కొంది. తాజాగా ఈ టీకా తొలి, రెండో దశ ప్రయోగాలను జపాన్‌లోనూ ప్రారంభిస్తున్నట్లు ఫైజర్, బయోఎన్‌టెక్ సంయుక్త ప్రకటన చేశాయి.
జాన్సన్ & జాన్సన్: మూడో దశలో...
మరో సంస్థ జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్ మూడోదశ ప్రయోగాలకు చేరుకుంది. వీటిని భారీస్థాయిలో నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. దాదాపు 60వేల వలంటీర్లపై ప్రయోగాలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తొలుత ప్రకటించింది. అయితే, అమెరికాలో వ్యాక్సిన్ పొందిన వలంటీర్ అస్వస్థతకు గురికాగా అక్టోబర్ 12న ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అనారోగ్యానికి గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు జేజేతో పాటు ఎఫ్‌డీఏ ప్రకటించాయి.
కొవాగ్జిన్: కొనసాగుతోన్న రెండో దశ
భారత్ బయోటెక్... నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో తయారుచేసిన కొవాగ్జిన్ టీకా ప్రయోగాలు రెండో దశకు చేరుకున్నాయి. తొలుత టీకా తీసుకున్న వలంటీర్లలో ఇప్పటివరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఏర్పడలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రయోగాలను 1100మంది వలంటీర్లపై జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.