కరోనా మహమ్మారి వల్ల.. 1930 దశకంలో సంభవించిన మహా మాంద్యాన్ని మించిన ప్రపంచ ఆర్థిక పతనాన్ని ప్రస్తుతం చూడాల్సి వస్తోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మెనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా విచారం వ్యక్తం చేశారు.
170 కి పైగా దేశాల్లో కరోనా కారణంగా తలసరి ఆదాయ వృద్ధి ప్రతికూలంగా మారనుందని చెప్పారు. వాషింగ్టన్‌లో సంక్షోభ పరిస్థితులు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రాధాన్యతలు అనే అంశంపై మాట్లాడిన ఆమె... ప్రస్తుత సంక్షోభ పరిస్థితులపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
మునుపెన్నడు ఎరుగనిది..
కరోనా మెరుపు వేగంతో.. సామాజిక, ఆర్థిక క్రమాన్ని దెబ్బతీస్తోందని చెప్పారు క్రిస్టాలినా. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం అనిశ్చితిలో ఉందన్నారు. ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రతికూల వృద్ధిరేటు నమోదు చేస్తుందని అంచనా వేశారు.
కరోనా మహమ్మారి రాక ముందు 2020లో 160 దేశాల్లో తలసరి ఆదాయం సానుకూల వృద్ధిని తాము అంచనా వేసినప్పటికీ.. ప్రస్తుతం అదే వృద్ధి 170కి పైగా దేశాల్లో ప్రతికూలతకు లోనుకానున్నట్లు చెప్పారు. రిటైల్, ఆతిథ్యం, రవాణా పర్యాటక రంగాల్లో పనిచేసే కార్మికులతో పాటు స్వయం ఉపాధి పొందుతున్నవారు.. ఎక్కువగా నష్టపోయారని విచారం వ్యక్తం చేశారు.
నష్టాన్ని తగ్గించుకోవాలి..
ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియాలోని అభివృద్ధి చెందుతున్న దేశాలు అధిక ప్రమాదంలో ఉన్నాయని అభిప్రాయపడ్డారు క్రిస్టాలినా. మార్చి, ఏప్రిల్ నెలల్లో అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి సుమారు 100 బిలియన్ డాలర్లు పెట్టుబడులు బయటకు వెళ్లాయన్న ఆమె.. ప్రపంచ ఆర్థిక సంక్షోభ కాలంలో జరిగిన నష్టానికి ఇది మూడు రెట్లు ఎక్కువగా పేర్కొన్నారు. ఈ సంక్షోభ పరిస్థితుల్లో అన్ని ప్రపంచ వేదికలు ఒక్కతాటి పైకి వచ్చి.. మహమ్మారిపై పోరాడాలని సూచించారు. సమయానుకూల నిర్ణయాలతో మాంద్య పరిస్థితులను తగ్గించుకోవాలని ఉద్ఘాటించారు.
ఇదీ చదవండి:కరోనా నుంచి కోలుకుంటున్న ప్రధాన మంత్రి