ప్రాణాంతక కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తోంది. 199 దేశాల్లో విస్తరించిన వైరస్.. ఇప్పటివరకు 23 వేల మందికిపైగా బలితీసుకుంది. మొత్తం కేసులు 5 లక్షల 31 వేలకు పైమాటే. ఇటలీ, స్పెయిన్, అమెరికా, యూకేలు అత్యంత ప్రభావితమవుతున్నాయి.
ఒక్క ఐరోపాలోనే మృతుల సంఖ్య 15వేలు దాటింది. ఒక్కరోజులోనే ఇటలీలో 712, స్పెయిన్‌లో 718 మంది బలయ్యారు. ఇరాన్లో 157 మంది చనిపోయారు.
చైనాను దాటిన అగ్రరాజ్యం...
అగ్రరాజ్యం కేసుల సంఖ్యలో చైనాను అధిగమించింది. అక్కడ ఒక్కరోజు కేసులు 16 వేలు దాటాయి. మొత్తం కేసులు దాదాపు 85 వేలు. చైనా 81 వేల 285పైగా కేసులతో రెండో స్థానంలో నిలిచింది. ఇటలీ 80 వేల 500కుపైగా కేసులతో మూడుకు పడిపోయింది.
అమెరికాలో 24 గంటల వ్యవధిలో 263 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 1290ని చేరింది. న్యూయార్క్‌లో ఒక్కరోజే 100 మందికి మించి ప్రాణాలు కోల్పోయినట్లు గవర్నర్ ఆండ్రూ తెలిపారు.
కరోనా బాధితులకు సేవలందిస్తున్న సైన్యానికి కూడా కొవిడ్ వేగంగా సోకుతున్నట్లు అమెరికా సైన్యం తెలిపింది.
కష్టాల్లో పాక్...
కరోనా ఉద్ధృతితో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిన పాకిస్థాన్.. సాయం కోసం అభ్యర్థిస్తోంది. అక్కడ కేసులు 12వందలకు సమీపించాయి. 9 మంది మరణించారు. ఈ క్రమంలో.. వైరస్ నియంత్రణ సహా బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు 370 కోట్ల డాలర్ల మేర రుణసాయం చేయాలని ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్, ఏడీబీని రుణసాయం కోరింది దాయాది దేశం.
బ్రిటన్‌లో..
24 గంటల వ్యవధిలో తొలిసారి 100కుపైగా మరణాలను నమోదుచేసుకుంది బ్రిటన్. గురువారం రోజు అక్కడ 115 మంది కరోనా కారణంగా మృతి చెందారు. మొత్తం మరణాలు 578గా ఉన్నాయి.
ఫ్రాన్స్‌లో 16 ఏళ్ల యువతికి...
ఫ్రాన్స్‌లోనూ కరోనా కోరలు చాస్తోంది. తాజాగా అక్కడ 365 మరణాలు, 3, 922 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ దేశంలో ఒక్కరోజులో ఇదే అత్యధికం. మృతుల్లో 16 ఏళ్ల యువతి ఉండటం కలవరపెడుతోంది. మొత్తం కేసులు 30 వేలకు చేరువలో ఉన్నాయి.
జర్మనీలో ఆరున్నర వేల కొత్త కేసులు నమోదుకాగా.. గురువారం రోజు 61 మందికి పైగా మృత్యువాత పడ్డారు. నెదర్లాండ్స్‌లో 78, బెల్జియంలో 42, స్విట్జర్లాండ్‌లో 38 మంది నిన్న కొవిడ్ 19కు బలయ్యారు. చైనాలో గురువారం ఆరుగురు మృతి చెందగా 67 కొత్త కేసులు వెలుగుచూశాయి.