కొవిడ్-19 (కరోనా) భయంతో జపాన్ తీరంలో నిలిపివేసిన డైమండ్ ప్రిన్సెస్ నౌకలో వైరస్ అంతకంతకూ వ్యాప్తి చెందుతోంది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో మొత్తం 355 మందికి వైరస్ సోకినట్లు తేలిందని జపాన్ ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు.
"ఇప్పటివరకు నౌకలోని 1,219 మందికి పరీక్షలు నిర్వహించాం. అందులో 355 మందికి పాజిటివ్‌గా (వైరస్ సోకినట్లు) తేలింది. ఇందులో 73 మందికి ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు."-కట్సునోబు కాటో, జపాన్ ఆరోగ్య శాఖ మంత్రి
నౌకలోని సిబ్బందికి మంగళవారం (ఫిబ్రవరి 18న) వైరస్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కొవిడ్ సోకలేదని నిర్ధరణ అయితే సిబ్బందిని నౌకలో నుంచి విడుదల చేయనున్నట్లు సమాచారం.
పౌరులను వెనక్కి తీసుకెళ్తాం!
నౌకలో ఉన్న తమ పౌరులను బయటకు తీసుకురావడానికి అమెరికా ప్రయత్నాలు చేస్తోన్న నేపథ్యంలో తాజా గణాంకాలు వెలువడ్డాయి. మరోవైపు నౌకలో ఉన్న తమ 330 మంది పౌరులను తీసుకెళ్లేందుకు విమానాన్ని పంపించనున్నట్లు హాంకాంగ్ తెలిపింది. కెనడా సైతం తమ పౌరులను స్వదేశానికి తీసుకురావడానికి సిద్ధమైంది. వారందరూ తమ స్వదేశాలకు తిరిగి వెళ్లిన తర్వాత మరో వారం పాటు నిర్బంధంలో ఉంచాలని ఆయా దేశాలు నిర్ణయించుకున్నాయి.
హాంకాంగ్‌లో దిగిన ఓ ప్రయాణికుడికి కొవిడ్ లక్షణాలు కనిపించడం వల్ల డైమండ్ ప్రిన్సెస్‌ను యొకోహోమా తీరంలో నిలిపివేశారు. ఈ నౌకలో దాదాపు 50 దేశాలకు చెందిన 3,700 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. టెస్టింగ్ కిట్లతో పాటు సదుపాయాల కొరత కారణంగా నౌకలోని వారందరినీ ఒకేసారి పరీక్షలు నిర్వహించలేకపోతున్నారు అధికారులు.
ఇదీ చదవండి: కరోనా మృత్యుఘోష ఆగదా? 68 వేలు దాటిన కేసులు