పాకిస్థాన్ అణు పితామహుడిగా(Father of Pakistan Nuclear Program) పేరొందిన అబ్దుల్ ఖదీర్ ఖాన్(Abdul Qadeer Khan) కన్నుమూశారు. నెదర్లాండ్స్ అణు పరిశోధన కేంద్రంలో పనిచేసిన అబ్దుల్ 1970ల ప్రారంభంలో పాక్‌కు తిరిగి వచ్చారు. పాకిస్థాన్‌లో అణ్వాయుధ కార్యక్రమాన్ని(Pakistan Nuclear Program) ప్రారంభించిన ఆయన.. అనేక వివాదాస్పద అంశాలకు కేంద్రబిందువుగా నిలిచారు. 85ఏళ్ల అబ్దుల్.. సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని.. పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ రషీద్ అహ్మద్ తెలిపారు.
బంగ్లా యుద్ధం అనంతరం..
బెల్జియంలోని క్యాథలిక్ యూనివర్సిటీ ఆఫ్ లూవెన్ నుంచి మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో డాక్టరేట్ పొందిన ఖాన్.. 'భారత అణు పరీక్షల'(India's Nuclear Test in 1974) అనంతరం 1974లో పాక్ సైతం అణ్వాయుధాలు కలిగి ఉండాలని నాటి ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టోకు(Zulfikar Ali Bhutto) ప్రతిపాదించారు. 1971 బంగ్లా యుద్ధం నేపథ్యంలో బుట్టో ఈ ప్రతిపాదనను స్వీకరించారు. మొత్తంగా 1998 నాటికి పాక్‌ను అణ్వాయుధ(Pakistan Nuclear Test) దేశంగా మార్చారు ఖాన్. 1936లో అవిభాజ్య భారత్‌లోని భోపాల్‌లో జన్మించిన అబ్దుల్.. విభజన అనంతరం కుటుంబంతో సహా పాకిస్థాన్‌కు వలస వెళ్లారు.
ఖాన్‌పై వచ్చిన పలు ఆరోపణలు..
- అంతర్జాతీయ శాంతిపై పనిచేసే 'కార్నెగీ ఎండోమెంట్' పరిశోధన ప్రకారం.. పాక్ అణ్వాయుధ అభివృద్ధి కోసం.. నెదర్లాండ్స్ నుంచి యురేనియం శుద్ధి సాంకేతికతను అబ్దుల్ ఖదీర్ ఖాన్ తస్కరించారనే ఆరోపణలున్నాయి.
- "మేము గడ్డి తిన్నా సరే.. ఆకలితో అలమటించినా సరే.. మా దగ్గర అణు బాంబు ఉంటుంది" అనే వ్యాఖ్యలతో ఆయన అపఖ్యాతిని మూటగట్టుకున్నారు.
- ఇరాన్‌కు, ఉత్తర కొరియాకు అణు రహస్యాలను చేరవేస్తున్నారనే ఆరోపణలను సైతం ఖాన్ ఎదుర్కొన్నారు.
స్వదేశంలో హీరో..
అంతర్జాతీయ సమాజంలో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. స్వదేశంలో హీరోగా, అణుపితామహునిగా ఖ్యాతికెక్కారు ఖాన్. 'ఇస్లామిక్ న్యూక్లియర్ బాంబు పితామహుడిగా' ముస్లిం దేశాలు కీర్తించాయి. అయితే 2001లో పాక్ పగ్గాలను చేజిక్కించుకున్న సైన్యాధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్(Pervez Musharraf) ఖాన్‌ను దూరం పెట్టారు. దేశ అణు రహస్యాలను ఖాన్ విక్రయిస్తున్నారని ఆరోపించారు. అయితే వీటిని అబ్దుల్ ఖాన్ ఖండించారు.
ఇమ్రాన్ ఖాన్ సంతాపం..
అబ్దుల్ ఖదీర్ ఖాన్‌ను మరణంపై పాక్ వ్యాప్తంగా నివాళులు వెల్లువెత్తాయి. ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్(Imran Khan ) ఆయనను "జాతీయ చిహ్నం"గా అభివర్ణించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
పాకిస్థాన్ అణు కార్యక్రమాన్ని అణచివేసేందుకు ప్రయత్నించిన పాశ్చాత్య దేశాలను ధిక్కరించిన ఖాన్ జాతీయ సంపద అని డాక్టర్ సమర్ ముబారత్ మండ్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు. దేశంలోని అణ్వాయుధాలను తయారు చేసిన ఘనత ఆయనదేనని కొనియాడారు.
ఇవీ చదవండి: