కొవిడ్ మహమ్మారి నుంచి విముక్తి కల్పించే వ్యాక్సిన్లు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఫైజర్, మోడెర్నా సంస్థలు తయారు చేసిన టీకాల పంపిణీ జరుగుతోంది. కాగా.. వ్యాక్సిన్ల కొనుగోలులో ధనిక దేశాలు గుత్తాధిపత్యం ప్రదర్శిస్తున్న వేళ.. పేద, మధ్యాదాయ దేశాలు చైనాపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. తమ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చైనా నుంచి తక్కువ ధరకు వచ్చే టీకాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఆ టీకాలు పనిచేస్తాయా? లేదా? అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. చైనా వ్యాక్సిన్లు పనిచేయవు అని చెప్పేందుకు ఎలాంటి స్పష్టమైన కారణాలు లేనప్పటికీ.. ఆ దేశానికి టీకా కుంభకోణాల చరిత్ర ఉంది. అంతేగాక, టీకా తుది ప్రయోగాలపై చైనా తయారీ సంస్థలు బాహ్య ప్రపంచానికి లోతైన వివరాలు ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా పలు వ్యాక్సిన్ అభివృద్ధి సంస్థలు వచ్చే ఏడాది నాటికి 12 బిలియన్ల డోసులను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే ఇందులో ఇప్పటికే 9 బిలియన్ల డోసులను సంపన్న దేశాలు రిజర్వ్ చేసుకున్నాయి. భారీ స్థాయిలో టీకా కొనుగోలుకు ఆయా సంస్థలతో ఒప్పందాలు పూర్తి చేసుకున్నాయి. కొవిడ్ టీకాలు అన్ని దేశాలకు సమానంగా అందాలన్న లక్ష్యంతో డబ్ల్యూహెచ్‌వో ఆధ్వర్యంలో ఏర్పాటైన కొవాక్స్ కూటమి వ్యాక్సిన్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొవిడ్ నుంచి బయటపడాలంటే పేద, మధ్యాదాయ దేశాలకు చైనాపై ఆధారపడటం తప్ప మరో మార్గం కన్పించట్లేదు.
కుంభకోణాలు ముంచేశాయి..!
ప్రపంచవ్యాప్తంగా పెద్ద మొత్తంలో కరోనా వ్యాక్సిన్లను తయారుచేస్తున్న దేశాల్లో చైనా కూడా ఒకటి. ప్రస్తుతం అక్కడ ఆరు వ్యాక్సిన్లు చివర దశ ప్రయోగాల్లో ఉన్నాయి. వచ్చే ఏడాది నాటికి 100కోట్ల డోసులను అందుబాటులోకి తెస్తామని ఇటీవల చైనా అధికారులు ప్రకటించారు. ఈ డోసులను సమర్థవంతంగా ఇతర దేశాలకు అందించి.. కరోనా విషయంలో తమపై పడిన అపవాదును తొలగించుకోవాలని డ్రాగన్ విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. అయితే వ్యాక్సిన్లపై గతంలో జరిగిన కుంభకోణాలు, తయారీ, సరఫరా సమస్యలతో సొంత ప్రజల విశ్వాసాన్నే కోల్పోయిన నేపథ్యంలో చైనా అభివృద్ధి చేస్తున్న టీకాలు నిజంగా పనిచేస్తాయా? లేదా? అన్నది ఇప్పటికైతే సమాధానం లేని ప్రశ్నగా మారింది.
'చైనా చరిత్రలో అనేక వ్యాక్సిన్ల కుంభకోణాలు చోటుచేసుకున్నాయి. టీకాల తయారీ, ప్రయోగాలు తదితర శాస్త్రీయ వివరాలపై డ్రాగన్ పారదర్శకంగా వ్యవహరించడంలేదు. ఇక గతంలో టీకా డెలివరీల్లోనూ అనేక సార్లు సమస్యలు తలెత్తాయి. వీటన్నింటినీ చూస్తే చైనా వ్యాక్సిన్లను విశ్వసించొచ్చా లేదా అన్న సందేహాలు వస్తున్నాయి' అని బ్రిటన్‌లోని కెంట్ యూనివర్శిటీ ప్రొఫెసర్ జోయ్ జాంగ్ అనుమానాలు వ్యక్తం చేశారు. 2016లో అక్కడ భారీ టీకా కుంభకోణం బయటపడింది. పిల్లల కోసం తయారుచేసిన 20లక్షల డోసులను సరిగ్గా భద్రపరచలేదనే ఆరోపణలు వచ్చాయి. కుంభకోణాలతో చైనాలో వ్యాక్సినేషన్ రేట్లు అమాంతం పడిపోయాయి.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ చైనా టీకాకు తమ దేశంలో అనుమతులు మంజూరు చేశాయి. మొరాకో, టర్కీ, ఇండోనేషియా తదితర దేశాలు కూడా చైనా వ్యాక్సిన్లపై పరిశీలనలు జరుపుతున్నాయి. అయితే కొన్ని దేశాల్లో వీటిపై అనుమానాలు మాత్రం లేకపోలేదు. మరి వీటిన్నింటినీ అధిగమించి చైనా అతిపెద్ద వ్యాక్సిన్ పంపిణీదారుగా అవతరిస్తుందో లేదో చూడాలి..!
ఇదీ చూడండి: చైనాలో మళ్లీ కరోనా కేసులు- లక్షల కొద్దీ టెస్టులు