చైనా ప్రయోగించిన లాంగ్‌మార్చ్ 5బీ రాకెట్ శకలాలతో భూమికి పెను ముప్పు తప్పిపోయింది. భూగ్రహ వాతావరణంలోకి ప్రవేశించగానే రాకెట్‌కు చెందిన చాలా భాగాలు కాలిపోయాయని చైనా మ్యాన్డ్ స్పేస్ ఇంజినీరింగ్(సీఎంఎస్ఈ) కార్యాలయం తెలిపింది. బీజింగ్ కాలమానం ప్రకారం ఉదయం 10.24 గంటలకు భూవాతావరణంలోకి ప్రవేశించినట్లు పేర్కొంది.
రాకెట్ శకలాలు ధ్వంసమైన తర్వాత మిగిలిన భాగాలు.. హిందూ సముద్రంలో పడినట్లు తెలుస్తోంది. 72.47 డిగ్రీల తూర్పు రేఖాంశం, 2.65 డిగ్రీల ఉత్తర రేఖాంశం వద్ద.. బహిరంగ సముద్ర ప్రాంతంలో రాకెట్ పడినట్లు సీఎంఎస్ఈ పేర్కొనగా... ఈ ప్రాంతం మాల్దీవులకు సమీపంలో ఉంటుందని హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వార్తా సంస్థ స్పష్టం చేసింది.
100 అడుగుల పొడవు, 22 మెట్రిక్ టన్నుల బరువుతో ఉన్న ఈ రాకెట్‌ను చైనా గత నెలలో ప్రయోగించింది. మానవులు పంపిన వాటిలో భూగ్రహంపైకి తిరిగి వచ్చిన అతిపెద్ద వస్తువు ఇదే. ఇది ఎక్కడ పడిపోతుందోనని అంతర్జాతీయంగా తీవ్ర చర్చ జరిగింది. మానవులకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
తుర్కమెనిస్థాన్లోని జనావాసాలపై ఇది కూలిపోయే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు తొలుత అంచనా వేశారు. రాకెట్ శకలాలు భూమిని ఢీకొనే చోట పెద్దఎత్తున విధ్వంసం తప్పదని హెచ్చరించారు. అయితే సముద్రంలోనే ఇవి కూలడం వల్ల పెను ప్రమాదం తప్పినట్లైంది.