భారత్ సైన్యంతో ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో చైనా అప్రమత్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఆక్సాయిచిన్ పరిధిలోని గాల్వన్ లోయ ప్రాంతంలో తన సైనిక బలాన్ని పెంచుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు సరిహద్దు నియంత్రణ చర్యలను చైనా సైన్యం ముమ్మరం చేసినట్లు... ఆ దేశానికి చెందిన గ్లోబల్ టైమ్స్ పత్రికలో గుర్తుతెలియని సైనిక అధికారి పేరుతో ఓ వ్యాఖ్యానం ప్రచురితమైంది.
'చైనా భూభాగంలోని గాల్వన్ లోయ ప్రాంతంలో భారత్ అక్రమ సైనిక నిర్మాణాలు చేపట్టిన కారణంగా చైనా ఈ చర్యలకు పూనుకుందని' వ్యాఖ్యానంలో సైనిక అధికారి పేర్కొన్నారు. 'మే నెలలో గాల్వన్ లోయ ప్రాంతం నుంచి భారత సైన్యం అనేక సార్లు సరిహద్దు దాటి వచ్చిందని' ఆరోపించారు. చైనా సరిహద్దులోని సైన్యానికి ఆటంకం కలిగించేలా భారత్ నిర్మాణాలు చేపడుతోందని వ్యాఖ్యానించారు.
అయితే ఈ కథనాలపై అటు భారత విదేశాంగ శాఖ గానీ, సైనిక అధికారులు గానీ స్పందించలేదు.
సాధారణమే
మరోవైపు.. సరిహద్దుపై తగిన అవగాహన లేకపోవడం వల్ల ఇరు దేశాల సైనికులు పొరపాట్లు చేస్తుంటారని దిల్లీలోని ఓ సైన్యాధికారి స్పష్టం చేశారు. సరైన సరిహద్దు లేని ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతాయని చెబుతున్నారు.
ఇటీవల ఘర్షణలు
భారత్- చైనాలకు చెందిన దాదాపు 250 మంది సైనికులు మే 5న తూర్పు లద్దాఖ్ వద్ద ఘర్షణ పడ్డారు. కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేసుకోవడం సహా రాళ్లు రువ్వుకున్నారు. నాలుగు రోజుల తర్వాత ఉత్తర సిక్కింలోని నకులా పాస్ వద్ద ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. అయితే ఇరుదేశాల మధ్య శాంతియుత వాతావరణం కొనసాగించాలనే కోరుకుంటున్నట్లు భారత్ స్పష్టం చేసింది.