పిల్లలను కనడంపై ఆంక్షలను చైనా సడలించింది. ఇక నుంచి దంపతులు ముగ్గురు పిల్లలను కనవచ్చని స్పష్టం చేసింది.
ఇటీవల (మే 11న) విడుదలైన జనాభా లెక్కలను దృష్టిలో ఉంచుకుని చైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చైనా జనాభా ఉహించిన దాని కన్నా వేగంగా తగ్గుతున్నట్లు గణాంకాలు వెల్లడించాయి. గత పదేళ్లలో యువత, మధ్య వయస్కుల వారి సంఖ్య గణనీయంగా తగ్గటమే కాకుండా 65 ఏళ్లు పైబడిన వారి సంఖ్య పెరగడం వల్ల కుటుంబ నియంత్రణపై ఉన్న ఆంక్షలకు సడలింపులు చేసినట్టు సమాచారం.
2015లో తొలిసారిగా సడలింపు..
జనాభా నియంత్రణ కోసం 1980లో ఆంక్షలను ప్రవేశపెట్టింది చైనా. 2015లో ఈ ఆంక్షలను తొలిసారిగా సడలించింది. దంపతులు ఒక్కరినే కనాలన్న ఆంక్షను సడలించి ఇద్దరిని కనేందుకు అనుమతించింది. అయితే ఈ చర్య సత్ఫలితాలను ఇవ్వలేదు. తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత, పిల్లల్ని పోషించే శక్తి లేకపోవడం, ఉద్యోగాలకు అంతరాయం ఏర్పడటం మొదలైనవి కారణాలని స్థానికులు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
15 నుంచి 59 ఏళ్ల మధ్య వారి సంఖ్య పదేళ్ల క్రితం 70.1 శాతంగా ఉండగా ఆ సంఖ్య గతేడాదికి 63.3 శాతానికి చేరింది. 65 ఏళ్ల పైబడిన వారి సంఖ్య 8.9 శాతం నుంచి 13.5 శాతానికి చేరింది.
ఇదీ చదవండి : 2027కు ముందే చైనాను అధిగమించనున్న భారత్!