కరోనా పుట్టినిల్లు చైనాలో వైరస్(virus) తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. వైరస్‌ను కట్టడి చేశామని ఆనందించేలోపే మళ్లీ కొత్త కేసులు నమోదవుతుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 1.5 కోట్ల మంది నివాసముండే గాంజావ్ నగరంలో 20 కొత్త కేసులు బయటపడటం అధికారుల్లో ఆందోళన రేకిత్తిస్తోంది. అప్రమత్తమైన ప్రభుత్వం పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధించింది. తదుపరి ఆదేశాల వరకు అందరూ ఇళ్లల్లోనే ఉండాలని ఆదేశించింది
గాంజావ్ నగరంలో వారం రోజుల్లో 20 కొవిడ్(covid) కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య చిన్నదే అయినప్పటికీ మహమ్మారిని అదుపుచేశామని ఆనందిస్తున్న అధికారుల్లో ఆందోళన రేకెత్తించింది. గత వేరియంట్ల కంటే ఈ కొత్త వేరియంట్ మరింత ప్రమాదకరమైనదని, చాలా ఉద్ధృతంగా ఉందని చైనా అధికారులు వెల్లడించినట్లు గ్లోబల్ టైమ్స్ వార్తాపత్రిక పేర్కొంది.
కొత్త వేరియంట్‌ను కనుగొనేందుకు లివాన్ జిల్లాలో శనివారం పరీక్షలకు ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలోని ఐదు ప్రాంతాల్లో ప్రజలకు పరీక్షలు నిర్వహించనుంది. బహిరంగ మార్కెట్లు, శిశు సంరక్షణ కేంద్రాలు, సాంస్కృతిక కార్యకలాపాలు, రెస్టారంట్లపై నిషేధం విధించింది. బహిరంగ కార్యక్రమాలను పరిమితం చేయాలని లివాన్‌కు చుట్టుపక్కల నాలుగు జిల్లాల అధికారులను ఆదేశించింది.
చైనాలో ప్రతిరోజు కొన్ని కేసులు నమోదవుతున్నాయి. అయితే వారంతా విదేశాల నుంచి వస్తున్నవారే. కానీ ఇద్దరు స్థానికులతోపాటు, దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో మరో 14 మందికి కొత్త రకం వైరస్ సోకినట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది.
ఇదీ చదవండి:coronavirus vaccine: టీకా తీసుకోండి రూ.840 కోట్లు గెలుచుకోండి!