కరోనా వైరస్ కారణంగా తమ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినకుండా ఉండేందుకు చర్యలకు దిగింది చైనా కేంద్రీయ బ్యాంక్. ఇందుకోసం ప్రభుత్వానికి 173 బిలియన్ అమెరికన్ డాలర్లు అందిస్తామని పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా(పీబీఓసీ) ప్రకటించింది. వైరస్‌ను నిర్మూలించేందుకు కృషి చేస్తున్న ఆసుపత్రులు, వైద్య సంస్థలకు తగినంత రుణాలను అందించాలని ఆర్థిక సంస్థలను రిజర్వ్ బ్యాంక్ కోరింది.
కరోనా బాధిస్తున్నప్పటికీ చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధిలోనే ఉన్నట్లు ప్రకటించింది డ్రాగన్ దేశ కేంద్ర బ్యాంక్. ఈ ఏడాది మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ విలువ 900 యువాన్లని(129 బిలియన్ డాలర్లు) గతేడాదితో పోలిస్తే ఇది ఎక్కువని స్పష్టం చేసింది. చైనాలో గతేడాది ఆర్థిక వృద్ధి 6.1 శాతంగా ఉంది. సార్స్ వైరస్‌ను పోలిన కరోనా ప్రభావం ఎక్కువకాలం కొనసాగితే ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
చైనా వుహాన్‌లో తలెత్తిన కరోనా వైరస్‌తో ఇప్పటివరకు 14వేల మంది బాధితులుగా మారారు. 300 మంది ప్రాణాలు కోల్పోయారు.
వైద్య సేవలకు సైన్యం సిద్ధం
మరోవైపు వైరస్ బారిన పడ్డవారికి చికిత్స అందించేందుకు ప్రభుత్వం నిర్మిస్తున్న ఆసుపత్రిలో సేవలందించేందుకు చైనా సైన్యం సిద్ధమైంది. "ఫైర్ గాడ్ మౌంటైన్" గా పిలిచే 1,000 పడకల ఆసుపత్రిలో 1,400 మంది సైనిక వైద్యులు చికిత్స అందించనున్నారు. ఇప్పటికే ఈ ఆసుపత్రి నిర్మాణం చివరి దశకు చేరుకుంది.