సొంత నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా చైనా చివరి ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. నైరుతి చైనాలోని జిచాంగ్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి లాంగ్ మార్చ్ 3బీ వాహక నౌక ద్వారా కక్షలోకి ప్రవేశపెట్టింది. అమెరికా జీపీఎస్‌పై ఆధారపడకుండా బైదు పేరుతో సొంత నావిగేషన్ వ్యవస్థను ఏర్పరుచుకునే లక్ష్యంతో చైనా ఈ ఉపగ్రహ ప్రయోగం చేపట్టింది.
2000లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌లోని 55 ఉపగ్రహాల్లో ఇది చివరిది. ఈనెల 16నే ఈ ప్రయోగం చేపట్టాల్సి ఉండగా.. సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల వాయిదాపడింది. ప్రస్తుత ప్రయోగంతో తమకు అత్యంత కచ్చితమైన నావిగేషన్, స్థితి, సమయం, కమ్యూనికేషన్ అందుబాటులోకి రానున్నట్లు చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ప్రకటించింది.
నాల్గో స్థానం...
ఇప్పటివరకూ 3దేశాలకు మాత్రమే సొంత నావిగేషన్ వ్యవస్థలున్నాయి. అమెరికాకు జీపీఎస్, రష్యాకు గ్లొనాస్, యూరోపియన్ సమాఖ్యకు గెలీలియో ఉండగా ఇప్పుడు నాల్గో దేశంగా చైనా వాటి సరసన చేరింది. భారత్ సైతం నావిక్ పేరుతో ప్రత్యేక నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటు చేసుకునే ప్రయత్నాల్లో ఉంది.
ఇదీ చూడండి:నడ్డా- రాహుల్ మధ్య 'చైనా' వార్