భారత్ వేదికగా జరిగిన షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సభ్యదేశాల సమావేశం అనేక సానుకూల సంకేతాలను ఇచ్చిందని చైనా పేర్కొంది. పలు సమస్యలపై నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారని తెలిపింది.
రష్యా ఎస్ఈఓ శిఖరాగ్ర సదస్సులో అంగీకరించిన అంశాలను అమలు చేయడం తాజా సమావేశం ఉద్దేశమని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్ పేర్కొన్నారు. కరోనాకు వ్యతిరేకంగా పోరాడటం సహా వర్తకం, పెట్టుబడులు, సాంస్కృతిక రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడం దీని లక్ష్యమని అన్నారు.
"అనేక ఏకాభిప్రాయాలు వచ్చాయి. సహకారం పెంపొందించుకోవడంపై నాయకులు ఉమ్మడి ప్రకటనను విడుదల చేశారు. ఇవన్నీ సానుకూల సంకేతాలు."
-హువా చున్యింగ్, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి
ఎస్సీఓ స్ఫూర్తిని కొనసాగించేందుకు, కరోనాతో పోరాడేందుకు సభ్యదేశాలు సంసిద్ధత వ్యక్తం చేశాయని తెలిపారు చ్యునింగ్. ఒకరి ప్రతిష్ఠకు భంగం కలిగేలా వైరస్ను ఉపయోగించడాన్ని సభ్యులు వ్యతిరేకించారని చెప్పారు. ప్రాంతీయ అంతర్జాతీయ ఆరోగ్య భద్రతను కాపాడేందుకు డబ్ల్యూహెచ్ఓకు మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు.
ఈ నెల మొదట్లో ఎస్సీఓ సభ్యదేశాల అధిపతులు శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ దీనికి హాజరయ్యారు. వర్చువల్ పద్ధతిలో రష్యా ఈ సదస్సును నిర్వహించింది. దీనికి అనుబంధంగా సోమవారం జరిగిన ప్రభుత్వాధినేతల సమావేశానికి భారత్ ఆతిథ్యమిచ్చింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ భేటీకి అధ్యక్షత వహించారు.
సంబంధిత కథనాలు: