అమెరికాతో వివాదాల పరంపర కొనసాగిస్తూ చైనా మరో అడుగేసింది. తమ దేశంలో నిర్వహిస్తున్న కార్యకలాపాలపై సవివర నివేదిక అందజేయాలని చైనాలోని అమెరికా మీడియా సంస్థలను ఆదేశించింది. ఈ మేరకు.. ఏబీసీ, లాస్ ఏంజిలిస్ టైమ్స్, మిన్నెసొట పబ్లిక్ రేడియా, బ్యూరో ఆఫ్ నేషనల్ ఎఫైర్స్, న్యూస్ వీక్, ఫీచర్ స్టోరీ న్యూస్‌కు ఆదేశాలు జారీ చేసింది.
సంస్థలో పనిచేసే ఉద్యోగుల సమాచారంతో పాటు, ఆర్థిక కార్యకలాపాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలపై ఏడు రోజుల్లోగా నివేదిక అందించాలని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అమెరికాలో చైనా మీడియా ఎదుర్కొంటున్న అసంమంజస అణచివేతకు ప్రతిస్పందనగా ఈ చర్యలు చేపట్టాల్సి వచ్చిందని పేర్కొంది.
చైనాకు చెందిన మీడియా సంస్థలు వారి సమాచారాన్ని పంచుకోవాలని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఆదేశించిన ఐదు రోజుల తర్వాత ఈ ప్రకటన రావడం గమనార్హం. ఆరు చైనా వార్తా సంస్థలు తమ వివరాలు సమర్పించాలని పాంపియో ఇదివరకు ఆదేశించారు. చైనా మీడియాకు ఇటువంటి ఆదేశాలు జారీ చేయడం ఇది మూడో సారి. ఈ నేపథ్యంలో చైనా సైతం అమెరికాకు చెందిన ఆరు సంస్థలకు ఇదే తరహా నోటీసులు జారీ చేసింది.